Begin typing your search above and press return to search.

ప్యాకేజీ ఇవ్వ‌నందుకు మోడీ క్ష‌మాప‌ణ‌ చెప్పాలి

By:  Tupaki Desk   |   12 March 2016 4:18 PM IST
ప్యాకేజీ ఇవ్వ‌నందుకు మోడీ క్ష‌మాప‌ణ‌ చెప్పాలి
X
ప్ర‌త్యేక ప్యాకేజీ...రాష్ట్రం ఆర్థిక క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేసే సంజీవ‌నని! కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ఆర్థిక‌ ప్యాకేజీ రేసులో అనేక రాష్ర్టాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తో పాటు ఈశాన్య రాష్ర్టాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే జ‌మ్ము క‌శ్మీర్‌ - బీహార్‌ లకు ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ ప్యాకేజీ ప్ర‌క‌టించారు. ఆయా రాష్ర్టాల ఎన్నిక‌ల ప్రచారంలో ఈ మేర‌కు హామీ ఇచ్చారు. మోడీ ఇచ్చిన ఆ హామీలే ఆయ‌నకు చిక్కుగా మారాయి.

గత ఏడాది బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఎన్డీయే ఘోర పరాజయాన్ని చవిచూసిన అనంతరం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ బీహార్‌ లో తొలిసారిగా నేడు పర్యటించనున్నారు. ఒక రోజు బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ కొత్తగా నిర్మించిన దిఘా-సోనెపూర్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ నేపథ్యంలో బీహార్‌ రాష్ట్ర అధికార‌ప‌క్షంతో భాగ‌స్వామ్యం పంచుకుంటున్న‌ రాష్ట్రీయజనతాదళ్ (ఆర్జేడీ) మోడీపై విమర్శల వర్షం కురిపించింది. ఎన్నిక‌ల త‌ర్వాత మోడీ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటి సారి అయిన నేప‌థ్యంలో ఆర్జేడీ నాయకుడు - రాష్ట్ర మంత్రి తేజస్వి ప్రసాద్ మోడీ టార్గెట్‌ గా ఘాటు కామెంట్లు చేశారు.

ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ల‌క్ష్యంగా సెటైర్లు వేశారు."మోడీజీ ప్రధానిగా వ్యవహరించండి...ఆర్ ఎస్ ఎస్ ప్రచార కర్తగా కాదు" అంటూ సూచించారు. బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజి వాగ్దానాన్ని నెరవేర్చనందుకు రాష్ట్ర ప్రజలకు ఆయ‌న క్షమాపణ చెప్పాలని తేజస్వి ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆనాడు ఓట్ల కోస‌మే మోడీ ప్యాకేజీ మాట‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చార‌ని మండిప‌డ్డారు.ఇదిలా ఉండ‌గా ప్రధానిమంత్రి ప‌ర్య‌ట‌న కాబ‌ట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదిక పంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్యాకేజీ గురించి నితీశ్ సైతం నిల‌దీసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.