Begin typing your search above and press return to search.

బ్యాలెట్ లో 39వ నంబరు వెతికి మరీ ఓటేశారట

By:  Tupaki Desk   |   20 March 2021 6:30 AM GMT
బ్యాలెట్ లో 39వ నంబరు వెతికి మరీ ఓటేశారట
X
అధికారపక్షం.. ప్రధాన ప్రతిపక్షం (సాంకేతికంగా అలాంటి తెలంగాణలో లేకున్నా.. ఇప్పటికైతే కాంగ్రెస్).. ఇప్పుడిప్పుడు బలపడుతున్న మరో ప్రతిపక్షం బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన కోదండం సారు.. ఇలాంటోళ్లు ఎన్నికల బరిలో ఉన్న చోట.. సోషల్ మీడియాలో అదే పనిగా వీడియోలు పోస్టు చేయటం.. ఏదైనా అంశం చోటు చేసుకున్న వెంటనే రియాక్టు కావటం.. సీఎం కేసీఆర్ ను అదే పనిగా తిట్టటం.. తప్పు పట్టటం.. దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం లాంటి సంచలనాలకు.. సెల్ ఫోన్ బ్యాచ్ అంటూ రాజకీయ వర్గాల్లో సరికొత్త టీంను సిద్ధం చేసుకున్న నేతగా.. తీన్మార్ మల్లన్నను చెప్పాలి.

ప్రస్తుతం నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ జిల్లాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో.. విజయవంతమైన నాలుగో రోజు నడుస్తోంది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ముందు ఉన్నప్పటికీ.. ఎలాంటి రాజకీయ పార్టీ అండ లేకుండా.. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు రావటం.. రెండో స్థానంలో నిలవటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎలాంటి అంచనాలు లేకుండా ఓట్లు లెక్కింపు మొదలైతే.. లెక్కిస్తున్న కొద్దీ.. రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న తీన్మార్ మల్లన్నకు వస్తున్న ఓట్లు రాజకీయ వర్గాల్నే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి.. ఎక్కడో 39వ నంబరులో ఉన్న తీన్మార్ మల్లన్నకు అన్నేసి ఓట్లు ఎలా పడ్డాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని ఒక మీడియా సంస్థ మల్లన్నకు సంధించింది. దానికి బదులిచ్చిన ఆయన.. ఓటరు పార్టీని.. అనుబంధ సంఘాల్ని.. ఇతరుల్ని చూడలేదు.

తమ కష్టాలు తీర్చే వ్యక్తి కోసం బ్యాలెట్ బాక్సులో 39వ నెంబరు వెతికి మరీ ఓటు వేయటంతో ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. తాను ఇప్పటికి పదిశాతం మాత్రమే పని చేశానని.. రాబోయే రోజుల్లో మరింత పని చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని.. సీఎంను తరచూ టార్గెట్ చేస్తున్నారు.. ఇబ్బందులు రావా? అని ప్రశ్నిస్తే.. ప్రశ్నించే వాడితో ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందే అని.. అలాంటి వ్యక్తిని తొలగించాలని చూస్తారన్నారు.

తనకు ప్రాణ భయం లేదు కానీ తన టీమ్ తనకు ఎలాంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకుందన్నారు. గట్టి నిఘాను ఏర్పాటు చేశారని.. ఆకాశం నుంచి ఇనుప ముక్క పడినా.. దానికి కేసీఆరే కారణమవుతారన్నారు. సెల్ ఫోన్ బ్యాచ్ అండతోనే భారీగా ఓట్లు ఫొందారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇప్పుడు వారు చెబుతున్న సెల్ ఫోన్ బ్యాచ్ మూలంగానే నాలుగు రోజులుగా ప్రభుత్వానికి నిద్ర పట్టటం లేదని.. వారంతా ఆవారా గ్యాంగ్ కాదని.. రాజ్యాంగం ప్రకారం అంబానికి ఎలా ఓటు వచ్చిందో.. అలానే సెల్ ఫోన్ బ్యాచ్ కి అలానే ఓటు ఉంటుందని.. వారంతా తన సైనికులని పేర్కొన్నారు.