Begin typing your search above and press return to search.

తీన్మార్ మల్లన్న అరెస్టు.. అంత నేరం ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   28 Aug 2021 4:31 AM GMT
తీన్మార్ మల్లన్న అరెస్టు.. అంత నేరం ఏం చేశాడంటే?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేయటం.. టీఆర్ఎస్ వర్గాలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. విమర్శలతో వణికించే క్యూ న్యూస్ చానల్ వ్యవస్థాపకుడు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ స్థాయిలోఓట్లను సొంతం చేసుకొని.. త్రుటిలో విజయాన్ని మిస్ చేసుకున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చిలకడగూడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాత్రికి అరెస్టు చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇంతకీ తీన్మార్ మల్లన్న చేసిన నేరం ఏమిటననది చూస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీకి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో.. తనను బెదిరింపులకు గురి చేస్తూ.. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘ ఎన్నో ఏళ్లుగా జ్యోతిస్యాలయం నిర్వహిస్తున్నా. ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి ఇబ్బంది పెడుతున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్ 19న తీన్మార్ మల్లన్న నాకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వటానికి నిరాకరించాను. అందుకు ప్రతిగా తప్పుడు ప్రచారం చేయిస్తానంటూ బెదిరించాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాళ్లు అడిగిన డబ్బులు తాను ఇవ్వకపోవటంతో ఏప్రిల్ 20న తన చానల్ లో తప్పుడు వార్తను ప్రసారం చేసి బెదిరించినట్లు చెప్పారు. ఈ కంప్లైంట్ కు స్పందించిన పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఆగస్టు మూడున ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రెండుసార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన విచారణ జరిపారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లుగా పరకటించారు. మల్లన్న మీద మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ల ద్వారా అరెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. తీన్మార్ మల్లన్నకు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశం లేదన్నమాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.