Begin typing your search above and press return to search.

ఈ కొత్త ఐడియా.. టెక్కీల బాధలు తీర్చింది..

By:  Tupaki Desk   |   13 July 2020 5:31 PM GMT
ఈ కొత్త ఐడియా.. టెక్కీల బాధలు తీర్చింది..
X
కరోనాతో మహానగరాలు హైదరాబాద్, బెంగళూరు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో ఇక్కడ విస్తరించిన ఐటీ రంగం ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఆప్షన్ ఇచ్చి ఇళ్లకు పంపిస్తోంది. దీంతో చాలా మంది టెక్కీలు ఇప్పుడు రెండు నగరాలను ఖాళీ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలోనే కాదు.. కంప్యూటర్ ఆధారిత ప్రతీరంగంలోనూ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కంపెనీలు కల్పిస్తున్నాయి.

కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు. దీంతో ఐటీ సహా అన్ని సంస్థల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నగరాలను టెక్కీలు ఖాళీ చేస్తున్నారు. ఐటీ సిటీ అయిన బెంగళూరు నగరం ఇప్పుడు ఖాళీ అవుతోంది. టెక్కీలంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కరోనా తగ్గేవరకు ఇంటినుంచే పనిచేయనున్నారు. ఇప్పట్లో తగ్గడం కష్టం కావడంతో ఎప్పటికీ తగ్గుతుందో తెలియక బెంగళూరులోని తమ ఖరీదైన ప్లాట్లను టెక్కిలు ఖాళీ చేస్తున్నారు. వేలకు వేల అద్దెలు భరించలేక ఈ పనిచేస్తున్నారు.

బెంగళూరులో అద్దెలు వాచిపోతుంటాయి. ఆరు నెలల నుంచి ఏడాది వరకు అడ్వాన్స్ చెల్లించాలి. డబుల్ బెడ్ రూం ఇంటికి అద్దె రూ.24000 వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే సొంతూళ్లో ఉంటూ అంత అద్దె చెల్లించడం భారమని గ్రహించిన టెక్కీలు ఇప్పుడు కొత్త బాట పడుతున్నారు.

ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ఫర్నిచర్, సోఫాలు, మొత్తం ఇంటి సామాను, ఆఫీస్ ఐటమ్స్, సామగ్రి , డ్యాక్యుమెంట్స్, వాహనాలు ఇలా దేన్నైనా దాచుకోవడానికి బెంగళురులో ‘‘సేఫ్ స్టోరేజ్’’ సంస్థలు వెలిశాయి. కొత్త స్టార్టప్ లు అయిన వీటిల్లో మనం మన సామానులు భద్రపరుచుకోవచ్చు. పూర్తి సీసీటీవీ రక్షణలో చీప్ గా ఇవి బెంగళూరులో లభ్యమవుతున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు సామానును తమ సొంతిళ్లకు తరలించకుండా సేఫ్ గా ఈ సేఫ్ స్టోరేజీల్లో దాచుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. పూర్తి రక్షణ, సీసీ టీవీ నిఘా, ప్రమాదం జరిగినా బీమా సౌకర్యం ఉండడంతో వాటికి ఏమైనా మనకు భద్రత ఉంటుంది. నెలకు కేవలం రూ.3వేల లోపు మాత్రమే అద్దె తీసుకుంటుండడంతో ఇందులో తమ సామానులను భద్రపరచడానికి టెక్కీలే కాదు.. చిన్న ఐటీ సంస్థలు కూడా మొగ్గుచూపుతున్నాయి. కార్యాలయాలకు సంబంధించిన వస్తువులను ఇందులో దాచి భవనాలు ఖాళీ చేస్తున్నాయి. అద్దెభారాన్ని తప్పించుకుంటున్నాయి.

బెంగళూరులో ఈ సేఫ్ స్టోరేజ్ సామానులు భద్రపరుచుకునే సంస్థల వల్ల చాలా మంది టెకీలు, సంస్థలకు బోలెడు భారం తప్పుతోంది. కరోనావేళ అద్దెలు కట్టకుండా అందులో పదో వంతు కడితే చాలు భద్రంగా అద్దెభారాన్ని తప్పించుకోవచ్చు. ఈ కొత్త ఐడియా భలే ఉంది కదూ..