Begin typing your search above and press return to search.

విశాఖలో టీమిండియా విజయ వీచిక.. బౌలర్లు గెలిపించారోచ్

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
విశాఖలో టీమిండియా విజయ వీచిక.. బౌలర్లు గెలిపించారోచ్
X
దక్షిణాఫ్రికాతో మంగళవారం విశాఖపట్టణంలో జరిగిన మూడో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు ఓడిపోయి.. తప్పక గెలవాల్సిన సమయంలో కుర్రాళ్లు అదరగొట్టారు. బ్యాట్స్ మన్ తలా ఒక చేయి వేయడంతో తొలుత భారత్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57, 7ఫోర్లు, 2 సిక్స్ల్ లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54, 5 ఫోర్లు, 2 సిక్స్ లు) రాణించారు. రుతురాజ్.. నోకియా వేసిన ఒకే ఓవర్లో వరుసగా 5 ఫోర్లు కొట్టి ఔరా అనిపించాడు. క్రమంగా కిషన్ కూడా బ్యాట్ ఝళిపించాడు. వీరిద్దరూ 10 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్ రెండు సిక్సులతో 14 పరుగులు చేసి వెంటనే వెనుదిరిగాడు. కెప్టెన్ పంత్ (8 బంతుల్లో 6)నిరాశపర్చాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

200 దాటాల్సింది..10 ఓవర్లకు 97.. నష్టపోయింది ఒక్కటే వికెట్. వాస్తవానికి ఈ లెక్కన చూస్తే టీమిండియా 200 పరుగులు అవలీలగా చేయాలి. కానీ, మధ్యలో తడబడింది. శ్రేయస్ ఔటయ్యాక.. పంత్ (8బంతుల్లో 6), దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 6) వేగంగా ఆడలేకపోయారు. పాండ్యా బ్యాట్ ఝళిపించినా.. అవతలి ఎండ్ లో దూకుడు లేక స్కోరు వేగం తగ్గింది.

దక్షిణాఫ్రికా బౌలర్ కట్టుదిట్టమైన బంతులతో ఓ దశలో 31 బంతుల పాటు కనీసం బౌండరీ కూడా రాలేదు. చివరకు హార్దిక్ దూకుడు పెంచడంతో చివరి 9 బంతుల్లో 21 పరుగులు వచ్చాయి. కాగా, లక్ష్య ఛేదనలో సఫారీల జట్టు 131 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో హెండ్రిక్స్ (23), ప్రిటోరియస్‌ (20), క్లాసెన్‌ (29), పార్నెల్ (22*) తప్పితే ఎవరూ పెద్దగా రాణించలేదు.టీమిండియా బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 4, చాహల్‌ 3, భువీ, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన యజువేదంద్ర చాహల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అతడు రెండు క్యాచ్ లు కూడా పట్టాడు. దీంతో 48 పరుగుల తేడాతో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. నాలుగో టి20 శుక్రవారం రాజ్ కోట్ లో జరుగుతుంది.

తొలి 2 టి20ల్లా కాకుండా..ఢిల్లీలో జరిగిన మొదటి టి20లో టీమిండియా ఏకంగా 211 పరుగులు చేసింది. కానీ, మరో ఐదు బంతులుండగానే దక్షిణాఫ్రికా గెలిచేసింది. కారణం.. భారత బౌలర్లు కట్టుతప్పడమే. ప్రధాన పేసర్ భువనేశ్వర్ (1/43), కుర్రాడు అవేశ్ ఖాన్ (0/35), హర్షల్ పటేల్ (1/43) ధారాళంగా పరుగులిచ్చారు. చాహల్ సైతం (0/26) ఫర్వాలేకున్నా.. అక్షర్ పటేల్ (0/49) విఫలమయ్యాడు.

ఇక రెండో టి20లో టీమిండియా 148 పరుగులే చేసింది. బ్యాటింగ్ కఠినమైన కటక్ పిచ్ పై ఆ మాత్రం స్కోరు సరిపోయేదే. కానీ, మళ్లీ టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. భువనేశ్వర్ (4/13) అద్భుతంగా బంతులేసినా.. అవేశ్, హర్షల్ విడివిడాగా 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున మాత్రమే ఇచ్చినా.. స్పిన్నర్లు చాహల్ (1/49), అక్షర్ (1/19) దారుణ ప్రదర్శన కనబర్చారు. హార్దిక్.. 3 ఓవర్లలో 31 పరుగులివ్వడం.. లక్ష్యం కూడా చిన్నది కావడంతో దక్షిణాఫ్రికా సునాయాసంగానే గెలుపొందింది. అయితే, మంగళవారం నాటి మ్యాచ్ లో భువీ (1/21), అక్షర్ (1/28) అండగా నిలవడంతో.. హర్షల్ (4/25), చాహల్ (3/20) విజయవంతంగా పని పూర్తిచేశారు.

బౌలర్లను మార్చలేదు.. అదీ ద్రవిడ్ ప్రత్యేకత బౌలర్ల వైఫల్యంతో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటమి.. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం. అయినప్పటికీ, కోచ్ ద్రవిడ్ బౌలర్లను ఒక్కరిని కూడా మార్చకుండానే విశాఖ పట్టణంలో మూడో టి20 బరిలో దిగారు. బౌలర్లనే కాదు బ్యాట్స్ మన్ లో కూడా ఎవరినీ మార్చలేదు. మొత్తం మీద మూడు మ్యాచ్ ల్లోనూ టీమిండియా ఒకే జట్టుతో బరిలో దిగింది. కాగా,క్లిష్ట పరిస్థితుల్లోనూ ద్రవిడ్.. బౌలర్ల పై నమ్మకం ఉంచిత తీరును మెచ్చుకోకతప్పదు. ఇది కచ్చితంగా జట్టు ప్రయోజనాలకు మేలు చేసే ఆలోచనే. ఇక్కడే టీం తరఫున ఆలోచించడంతో ద్రవిడ్ ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతోంది.