Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మార్క్:పొన్నాల‌కు ఓకే..మ‌ర్రికి షాక్‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 6:41 AM GMT
కాంగ్రెస్ మార్క్:పొన్నాల‌కు ఓకే..మ‌ర్రికి షాక్‌
X
ఎట్టకేలకు జనగామ సీటుపై ఉత్కంఠ వీడింది. పీసీసీ చీఫ్ మాజీ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ లైన్ క్లియర్ చేశారు. జనగామ సీటును వదిలేయడానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అంగీకరించారు. జనగామ నుంచి పోటీ చేసేందుకు పొన్నాల లక్ష్మయ్యకు మార్గం సుగమం అయింది. జనగామ నుంచి పొన్నాల బరిలోకి దిగనున్నారు. టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇంచార్జ్ కుంతియా - పొన్నాల లక్ష్మయ్య చర్చలు జరిపారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు చర్చలు జరిపారు. అనంత‌రం నేడు జాబితా విడుద‌లైంది.

మొన్నటి వరకు జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారని భావించినప్పటికీ.. పొన్నాల ఢిల్లీలో భారీ స్థాయిలో లాబీయింగ్ జరిపి.. జనగామ స్థానాన్నే తనకే దక్కేలా పావులు కదిపారు. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పొన్నాల.. ఇక్కడి పరిస్థితులను వివరించి తనకే టికెట్ ఇవ్వాలని కోరారు. మొత్తానికి జనగామ సీటు పొన్నాలకే వరించింది. అయితే ఇప్పుడు కోదండరాం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే తెలియాల్సి ఉంది. మహాకూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి 8 స్థానాలు కేటాయించారు. వీటిలో మెదక్ - దుబ్బాక -సిద్దిపేట - మల్కాజ్‌ గిరి - వర్ధన్నపేట - అంబర్‌ పేట స్థానాల నుంచి టీజేఎస్ పోటీ చేయనుంది.

మ‌రోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డికి షాక్ ఇచ్చింది. సనత్‌ నగర్ నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. కూన వెంకటేష్ గౌడ్‌ ను సనత్‌ నగర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. దీంతో, ఈ స్థానంపై ఆశ‌లు పెట్టుకున్న మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి ఆశ‌లు గల్లంత‌య్యాయి. పార్టీ నిర్ణ‌యంపై మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి స్పందించాల్సి ఉంది.