Begin typing your search above and press return to search.

సెల్ఫీ వీడియోను స్నేహితుల‌కు పంపి..

By:  Tupaki Desk   |   3 May 2021 9:00 AM IST
సెల్ఫీ వీడియోను స్నేహితుల‌కు పంపి..
X
‘‘క‌రోనా బారిన ప‌డి నేను తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నాను. నా పరిస్థితి మీకు ఎవ్వరికీ రావొద్దు’’ జాగ్రత్త చెప్పి.. అంతలోనే మృతిచెందాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ దుర్ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబాబాద్ జిల్లా ప‌రిధిలో చోటు చేసుకుంది.

జిల్లాలోని కొత్త‌గూడెం మండ‌లం గాంధీన‌గ‌ర్ కు చెందిన కంగాల ర‌వి (35) ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో.. న‌ర్సంపేట ప‌ట్ట‌ణంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్ర‌మంలోనే గ‌త రాత్రి ఆసుప‌త్రి బెడ్ మీద నుంచే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను స్నేహితులు, బంధువుల‌కు పంపించారు. ‘‘ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా అంటుకుంటుంది. కాబట్టి ఎవ్వ‌రూ అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రాకండి. త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించ‌డి. నేను ప‌డుతున్న ఇబ్బంది మీకు ఎవ్వ‌రికీ రావొద్దు’’ అని జాగ్రత్తలు చెప్పాడు రవి.

అయితే.. మర్నాడే ర‌వి ఆరోగ్యం విష‌మించింది. శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఎదుర‌వ‌డంతో.. ఖ‌మ్మం త‌ర‌లించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలో మార్గం మ‌ధ్య‌లోనే ర‌వి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యం తెలిసిన మిత్రులు, బంధువులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.