Begin typing your search above and press return to search.

ఢిల్లీని ద‌ద్ద‌రిల్లేలా చేసిన తెలుగు ఎంపీలు!

By:  Tupaki Desk   |   6 March 2018 11:43 AM GMT
ఢిల్లీని ద‌ద్ద‌రిల్లేలా చేసిన తెలుగు ఎంపీలు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు వంటి డిమాండ్ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఎంపీలు పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల తొలి సెషన్ ను స్తంభింప‌జేసిన సంగ‌తి తెలిసిందే. వారికి మ‌ద్ద‌తుగా ఏపీలో ప్ర‌జ‌లు కూడా త‌మ నిర‌స‌న‌ను వ్యక్త‌ప‌రుస్తూ....బంద్ లు నిర్వ‌హించారు. తాజాగా మొద‌లైన బ‌డ్జెట్ స‌మావేశాల‌లో టీడీపీ - వైసీపీ - కాంగ్రెస్ ఎంపీలు త‌మ గ‌ళాన్ని గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. 42 మంది ఎంపీలు క‌లిస్తే పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌లు ద‌ద్ద‌రిల్లిపోతాయా? తెలుగోళ్లను పెద్ద‌గా ప‌ట్టించుకోని కేంద్ర ప్ర‌భుత్వానికి చురుకు పుట్టించి పార్ల‌మెంటును స్తంభింప‌జేసే స‌త్తా తెలుగు ఎంపీల‌కుందా? అన్న సందేహాలు నేడు ప‌టాపంచ‌ల‌య్యాయి. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగితే తామంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని తెలుగు ఎంపీలు రుజువు చేశారు. నేడు....పార్లమెంటు ఇంటా బ‌య‌టా త‌మ నిర‌స‌న‌ల‌తో.. ఆందోళ‌న‌ల‌తో ఢిల్లీని ద‌ద్ద‌రిల్లేలా చేయ‌టంలో తెలుగు ఎంపీలు స‌ఫ‌ల‌మ‌య్యారు. వేర్వేరు అంశాల మీద ఏపీ.. తెలంగాణ ఎంపీలు గ‌ళం విప్ప‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌.. నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయ‌టంతో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ద‌ద్ద‌రిల్లిపోయాయి.

ఇరు స‌భ‌ల స‌భాప‌తులు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. స‌భ్యుల నినాదాలు.. ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య స‌భ‌లు హోరెత్తిపోయాయి. విభ‌జ‌న సంద‌ర్భంగా చేసిన హామీలు నెర‌వేర్చ‌ని ప‌క్షంలో పోరాటం మ‌రింత ఉధృతం అవుతుంద‌న్న సంకేతాల‌ను కేంద్రానికి పంప‌డంలో తెలుగు ఎంపీలు స‌ఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఎంపీల నిర‌స‌న‌నను తేలిగ్గా తీసుకున్న కేంద్రానికి....నేటి ప‌రిణామాలు షాక్ ఇచ్చాయని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌త్యేక హోదా, పెండింగ్ లో ఉన్న విభ‌జ‌న హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని ఏపీకి చెందిన ఎంపీలు త‌మ నిర‌స‌న‌ను మ‌రింత ఉధృతం చేశారు. పార్ల‌మెంటు బ‌య‌ట గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎంపీలు చేస్తున్న నిర‌స‌న కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్, వైసీపీ ఎంపీలు ప‌లువురు పాల్గొని త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. అంతేకాకుండా, రేణుకా చౌద‌రి స‌హా మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌ని, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని గ‌ళం విప్పారు. అయితే, మీడియాతో మాట్లాడే స‌మ‌యంలో మాత్రం టీడీపీ నేత‌ల కంటే చాలాకాలం నుంచే తాము హోదా కోసం పోరాడుతున్న‌ట్లుగా క్లెయిం చేసుకున్నారు.

మ‌రోవైపు, పార్లమెంట్ స్ట్రీట్ లో ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మ‌ద్దతు తెలిపారు. తొలి విడత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ఏపీకి మ‌ద్ద‌తుగా రాహుల్ ట్వీట్ చేశారు. మ‌రోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ వైసీపీ ఢిల్లీలో ధ‌ర్నా చేసింది. హోదా కోసం నాలుగేళ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తోందని, ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం ఆపబోమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ నెల 21వ తేదిన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. స్పందించకపోతే ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ధ‌ర్నా అనంత‌రం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైసీపీ నేతల‌ను పోలీసులు అరెస్టు చేసి 20 నిమిషాల తర్వాత విడుదలచేశారు.

నిన్న పార్ల‌మెంటు ఎదుట `శ్రీ కృష్ణుడి` వేషంలో మోదీతో రాయ‌బారం న‌డిపిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్...నేడు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ వేషంలో పార్ల‌మెంటుకు వ‌చ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ తీసేలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఢిల్లీ కంటే గొప్ప‌గా అమ‌రావ‌తిని నిర్మిద్దామంటూ తాను చెప్పిన మాట‌ల్ని ప్ర‌ధాని మోడీ నిల‌బెట్టుకోవాల‌న్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా, బెజ‌వాడ క‌న‌క‌దుర్గ సాక్షిగా మోదీ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌న్నారు. తెలుగు ప్రజల దెబ్బ రుచి చూడాలని మోదీ అనుకుంటే.. ఆయన ఇష్టమని శివప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మ‌రోవైపు తెలంగాణ ఎంపీలు రాజ్య‌స‌భ‌ను.. లోక్ స‌భ‌ను స్తంభింప‌చేశారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. వేర్వేరు అంశాల మీద రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేస్తున్న నిర‌స‌న తీవ్ర‌స్థాయికి చేరుకుంది. స‌భాప‌తి స్థానంలో ఉన్న వారు ఎంతగా ప్ర‌య‌త్నించినా.. ఎంపీలు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టంతో స‌భ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత కూడా స‌భ కంట్రోల్ లోకి రాక‌పోవ‌టంతో ఉభ‌య స‌భ‌లు రేప‌టికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తంగా ఢిల్లీ ద‌ద్ద‌రిల్లేలా తెలుగు ఎంపీలు త‌మ నిర‌స‌న‌తో చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.