Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు త‌మ్ముళ్ల న‌ల్ల‌జెండాలతో స్వాగ‌తం

By:  Tupaki Desk   |   4 Jun 2017 4:30 PM GMT
రాహుల్‌ కు త‌మ్ముళ్ల న‌ల్ల‌జెండాలతో స్వాగ‌తం
X
గుంటూరులో జ‌రిగే స‌భ కోసం కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఏపీకి చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ర‌ఘువీరారెడ్డి.. ప‌ల్లంరాజు.. కేవీపీ రామ‌చంద్ర‌రావు త‌దిత‌రులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇదిలా ఉంటే.. రాహుల్ ఏపీలోకి అడుగుపెట్టొద్దంటూ టీడీపీ త‌మ్ముళ్లు ప‌లువురు న‌ల్ల‌జెండాల‌తో స్వాగ‌తం ప‌లికారు. రాహుల్ స‌భ‌కు ఏపీ ప్ర‌జ‌లు హాజ‌రు కావొద్దంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు.. ఏపీ తెలుగు త‌మ్ముళ్లు బాగానే అర్థం చేసుకున్న‌ట్లుగా కనిపించింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని తేల్చేసిన బీజేపీ నేత‌ల్ని అడ్డ‌గించే విష‌యంలో ఏ మాత్రం ముందు రాని త‌మ్ముళ్లు.. రాహుల్ గో బ్యాక్ అనే నినాదాలు చేసే విష‌యంలో మాత్రం ఫుల్ బిజీగా ఉండ‌టం క‌నిపించింది.
గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం వ‌ద్ద కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికితే.. ఏపీ తెలుగు త‌మ్ముళ్లు మాత్రం న‌ల్ల జెండాల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. గ‌న్న‌వ‌రం నుంచి గుంటూరులోని ఆంధ్రా ముస్లిం క‌ళాశాల‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌త్యేక హోదా భ‌రోసా స‌భ‌లో పాల్గొనేందుకు రాహుల్ బ‌య‌లుదేరి వెళ్లారు. గ‌న్న‌వ‌రం నుంచి గుంటూరు వెళ్లే మార్గ‌మ‌ధ్యంలో విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు రాష్ట్రంలో అడుగు పెట్టే హ‌క్కు లేదంటూ టీడీపీ త‌మ్ముళ్లు నినాదాలు చేస్తూ.. జాతీయ ర‌హ‌దారిపై ఆందోళ‌న‌లు చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ప‌ర్య‌టించిన రాహుల్ గాంధీకి.. ఎప్ప‌డూ లేని రీతిలో ఇంత‌టి నిర‌స‌న ఎదురు కావ‌టం ఏమిట‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. చూస్తుంటే.. హోదా పేరుతో ఏపీలోకి రాహుల్ అడుగు పెట్ట‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇష్టం ఉండ‌దా? అన్న సందేహం క‌లిగేలా నిర‌స‌న‌లు చోటు చేసుకోవ‌టం క‌నిపిస్తుందని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/