Begin typing your search above and press return to search.

టీడీపీలో మ‌హిళా నేత‌లూ.. సైకిల్ దిగేస్తారా?

By:  Tupaki Desk   |   8 Oct 2020 9:30 AM IST
టీడీపీలో మ‌హిళా నేత‌లూ.. సైకిల్ దిగేస్తారా?
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మ‌రింత మంది సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారా? ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచి న నాయ‌కులే.. ఈ బాట‌లో ఉన్నార‌ని అనుకుంటే.. తాజాగా మ‌హిళా నాయ‌కురాళ్లు కూడా జంపింగుల‌కు రెడీ అవుతున్నార‌నే స‌మాచారం పార్టీలో గ‌గ్గోలు పుట్టిస్తోంది. పార్టీల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నీరు కావాల్సిందే. అలాగ‌ని.. సీనియ‌ర్ల‌ను, ఒక‌ప్ప‌టి.. ఆర్థిక ద‌న్నును వ‌దులుకునేందుకుఎవ‌రూ సిద్ధ ప‌డ‌రు. అవ‌స‌రం ఎవ‌రి నుంచైనా ఉండొచ్చు. కానీ, టీడీపీలో మాత్రం పాత‌త‌రం నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది.

పోనీ.. యువ‌త‌నైనా ప్రోత్స‌హిస్తున్నారా? అంటే.. అది కూడాలేదు. ఈ ప‌రిణామాల మ‌ధ్యే పాత‌త‌రం నాయ‌కులు కూడా ఇప్పుడు జంప్ చేసేందుకు, బాబుకు బై చెప్పేందుకు రెడీగా ఉన్నార‌ని ప‌లు జిల్లాల నుంచి అందుతున్న స‌మాచారం స్ప‌ష్టం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ స్పీక‌ర్‌.. ఎస్సీ నాయ‌కురాలు ప్ర‌తిభాభార‌తి, చిత్తూరు జిల్లాకు చెందిన దివంగ‌త డీకే ఆదికేశ‌వుల నాయుడు.. స‌తీమ‌ణి.. డీఏ స‌త్య‌ప్ర‌భ టీడీపీకి బై చెప్పేందుకు రెడీ అయ్యార‌నే స‌మాచారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే స‌త్య‌ప్ర‌భ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆది కేశ‌వుల నాయుడు తొలుత కాంగ్రెస్‌, త‌ర్వాత టీడీపీలో మంత్రిగా ప‌నిచేశారు. వివాద ర‌హితుడు.. విద్యాసంస్థ‌ల అధినేత‌. ఈ క్ర‌మంలో ఆయ‌న మ‌ర‌ణంతో స‌త్య‌ప్ర‌భ 2014లో చిత్తూరు నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత‌.. గ‌త ఏడాది రాజంపేట ఎంపీ గా కూడా పోటీ చేశారు.కానీ, చంద్ర‌బాబు తెలిసి తెలిసి.. త‌మ‌కు అన్యాయం చేశార‌ని.. ఇక్క‌డ పెద్దిరెడ్డి కుటుంబం హ‌వా ఉంటుంద‌ని, వారిని ఓడించే ప‌రిస్థితి లేద‌ని తెలిసి వ‌ద్ద‌న్నా అక్క‌డ టికెట్ ఇచ్చార‌నే బాధ‌, ఆవేద‌న ఈ కుటుంబంలో ఉంది. ఓట‌మి త‌ర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు.

పోనీ.. త‌న కుమారుడు డీకే శ్రీనివాస్ విష‌యాన్న‌యినా ప‌ట్టించుకోవాల‌ని చంద్ర‌బాబుకు విన్న‌విస్తూ.. వ‌చ్చారు. ఆయ‌న అదిగో ఇదిగో అంటూ కాలం గ‌డిపేశారు. ఈ క్ర‌మంలో పెద్దిరెడ్డే స్వ‌యంగా డీకే కుటుంబాన్ని వైసీపీకి చేరువ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌త్య‌ప్ర‌భ జ‌గ‌న్‌తో భేటీ అయ్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఈ కుటుంబం వ‌చ్చేయొచ్చు. ఇక‌, సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి.. త‌న కుమార్తె గ్రీష్మ‌కు లైఫ్ ఇచ్చేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు.


కానీ, కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న మాజీ మంత్రి.. కోండ్రు ముర‌ళీ మోహ‌న్‌కు ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. పైగా వైసీపీలోకి చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్ప‌టికైనా ఇవ్వాల‌ని ప్ర‌తిభా భార‌తి విన్నవించారు. కానీ, క‌ళా వెంక‌ట్రావు అడ్డుపుల్లలు వేస్తున్నార‌నే కార‌ణంగా.. ఆమెకు , ఆమె కుమార్తెకు చంద్ర‌బాబు ప‌ద‌వులు ఇవ్వ‌లేక పోతున్నార‌ని, ప్రాధాన్యం కూడా ఇవ్వ‌డం లేద‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక ఎన్నాళ్లు వేచి చూస్తాం.. అనుకున్న భార‌తి.. కోండ్రు క‌న్నా ముందుగానే వైసీపీలోకి చేరిపోవ‌డం బెట‌రని భావిస్తున్నార‌ట. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని అంటున్నారు. మొత్తానికి ఇద్ద‌రు సీనియ‌ర్ మ‌హిళా నాయ‌కురాళ్లు బాబుకు ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.