Begin typing your search above and press return to search.

టీడీపీ వర్సెస్ వైసీపీ: అంటుకున్న ‘నీటి’ మంటలు

By:  Tupaki Desk   |   2 July 2021 8:54 PM IST
టీడీపీ వర్సెస్ వైసీపీ: అంటుకున్న ‘నీటి’ మంటలు
X
ఏపీ మంత్రి సర్రున లేచాడు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను అంత మాట అంటావా? అని కడిగిపారేశాడు. నిన్న ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ నీటి యుద్ధం కాస్తా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ లాగా మారిపోయింది..

ఈ మధ్య రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటుతున్నాయి. సామరస్య విమర్శల కంటే వ్యక్తిగత దూషణలే ఎక్కువైపోతున్నాయి. తెలంగాణతో నీటి ఫైట్ విషయంలో ఆ రాష్ట్ర మంత్రులను అనకుండా సామరస్యంగా మెలుగుతున్న ఏపీ సీఎం జగన్ ను టీడీపీ టార్గెట్ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవి నేని ఉమ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదంపై తెలుగుదేశం పార్టీ నేతలు నిన్న నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, జగన్ లు డ్రామాలు ఆడుతున్నారని..కావాలనే ఆడుతున్న పెద్ద నాటకం అని విమర్శించారు. ఇదంతా ఇద్దరు సీఎంలు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర కామెంట్లు చేశాడు. జగన్ తోపాటు కేసీఆర్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడుదొంగలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు జలవివాదాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కేశినేని మండిపడ్డారు. అసలు జలవివాదమే ఒక పెద్ద డ్రామా అని కేశినేని విమర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉందన్నారు.

ఇక ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సైతం జలవివాదంపై స్పందించారు. ఏకపక్షంగా తెలంగాణ నీరు విడుదల చేసుకుంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. ఈ మౌనానికి కారణం పక్క రాష్ట్రంలో ఉన్న మీ ఆస్తులను కాపాడుకోవటమేనా? అంటూ జగన్ ను నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ లో తీర్మానమైన కేఆర్ఎంబీ నియంత్రణ పరిధిని ఎందుకు నోటిఫై చేయడం లేదు అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదల ఏకపక్షంగా జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో గతంలోనూ తెలుగు వారు ఉన్నారని.. కనుక తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రశ్నించలేకపోతున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో తెలుగు వారు ఉన్నారని.. ప్రగతి భవన్ లో భోజనం చేసినప్పుడు కూడా తెలుగువారు ఉన్నారని ఎద్దేవా చేశారు.

వీరిద్దరి వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు అమరావతి పరిధిలోని టీడీపీనేతలు కావడంతో అదే ప్రాంతానికి చెందిన మంత్రి వెల్లంపల్లి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా విరుచుకుపడ్డారు.

కేశినేనికి మతి భ్రమించిందని.. మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేశినేనికి లేదన్నారు.టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చి బాత్రూమ్ లు కట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి వ్యాఖ్యలతో మరోసారి మాటల మంటలు విజయవాడ కేంద్రంగా అంటుకున్నట్టు అయ్యింది.