Begin typing your search above and press return to search.

టీడీపీ ట్రోల్స్.. జగన్ బీ అలెర్ట్..

By:  Tupaki Desk   |   3 Aug 2019 3:30 AM GMT
టీడీపీ ట్రోల్స్.. జగన్ బీ అలెర్ట్..
X
ఇటీవల విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి ఓ మాట అన్నారు. రెండు నెలలకే వైసీపీ పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతోందంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించగా పోసాని సూటిగా సమాధానమిచ్చారు.. ‘కాపురం చేయగానే రెండు నెలలకే బిడ్డ పుట్టేస్తాడా? 9 నెలలు మోసి కన్నాక బిడ్డ పుడుతాడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఏడాది సమయం ఇవ్వరా?’ అని ప్రశ్నించిన జర్నలిస్టు చెంప చెళ్లుమనేలా సమాధానమిచ్చారు.

కానీ ప్రత్యర్థులు గోతికాడ నక్కవలే కాచుకు కూర్చున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. సందు దొరికితే ఏసెయ్యడానికి బలమైన పచ్చలాబీ ఎదురుచూస్తోందన్న ప్రచారం సాగుతోంది. చేతిలో బలమైన మీడియా ఉండడంతో తిమ్మినబమ్మిన చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే కుట్రకు తెరతీసిందన్న ప్రచారం జరుగుతోంది..

తాజాగా టీడీపీ సోషల్ మీడియా విభాగం జగన్ పాలనలోని లోపాలపై ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడలేదు. ఆర్బీఐ సాంకేతిక కారణాల వల్ల ఇలా ఆలస్యమైంది. అయితే ‘అన్నొచ్చాడుగా..! మాకింకా జీతాలెందుకు? గాలి భోంచేసి బతికేస్తాం. అయినా జీతాలిత్తామని అన్న మేనిఫెస్టోలో పెట్టలేదుగా ?’ టీడీపీ సోషల్ మీడియాలో జగన్ పాలన తీరును ఎండగడుతూ ట్రోలింగ్ మొదలు పెట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ విష ప్రచారం చేస్తోంది. రెండు నెలలకే జగన్ సర్కారును టార్గెట్ చేసి టీడీపీ అభాసుపాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ ఉద్యోగులకు జీతాలు ఈనెల 1న పడలేదనే వార్త ప్రచారంలోకి వచ్చాక ఏపీ ఆర్థిక స్థితి గురించి, నవరత్నాలు, లోటు బడ్జెట్ పై టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. పథకం ప్రకారం సోషల్ మీడియాలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా తేలిన విషయం ఏంటంటే ఏపీ ఉద్యోగులకు జీతాలు పడకపోవడానికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీతాలు చెల్లించే వ్యవస్థ ఇ-కుబేరాలో కొన్ని సాంకేతిక సమస్యలే కారణమని తేలింది. ఫలితంగానే బిల్లుల తుది విడుత చెల్లింపుల్లో జాప్యం జరిగిందని ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. అనంతరం సమస్య తీరి జీతాలు కూడా చెల్లించారు..

ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్రను టీడీపీ విజయవంతంగా పూర్తి చేసిందనే చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ వ్యవస్థ పనితీరును సక్రమంగా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్ పై, వైసీపీపై ఉంది. వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేయిస్తే ఇలాంటి తిప్పలు, ఆరోపణలు వచ్చేవి కావు. కొత్త ప్రభుత్వం అన్నాక వారి పాలనపై అందరి ఫోకస్ ఉంటుంది. పైగా ప్రత్యర్థి టీడీపీ చాలా బలమైనది. దాని చేతిలో బలమైన మీడియా ఉంది. ముఖ్యంగా వైసీపీ పాలన వైఫల్యాలు.. జీతాలు, చెల్లింపులపై నిఘా ఉంటుంది. లక్షల మందిని ప్రభావితం చేసే ఇలాంటి సున్నితమైన విషయాల్లో జగన్, వైసీపీ ప్రభుత్వం అలెర్ట్ గా ఉంటే అందరికీ మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.