Begin typing your search above and press return to search.

బరిలోకి దిగకుండా చంద్రబాబు భారీ తప్పు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   3 April 2021 4:30 AM GMT
బరిలోకి దిగకుండా చంద్రబాబు భారీ తప్పు చేస్తున్నారా?
X
గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో రాజకీయ విశ్లేషణ మరీ వన్ సైడ్ అన్నట్లుగా మారిపోయింది. గతంలో కాస్తంత మొహమాటాలు ఉండేవి. ఇప్పుడున్నంత బరి తెగింపు ఉండేది కాదు. తమకు తోచింది రాసే అవకాశం ఉన్నా.. ఇష్టం వచ్చినట్లుగా రాసేందుకు పాత్రికేయులు ఇష్టపడేవారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తప్పించి.. సాపేక్షంగా ఉండేందుకే మీడియా సంస్థలు ప్రయత్నించేవి.

బ్యాడ్ లక్ ఏమంటే.. గడిచిన 20 ఏళ్లలో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుటు విలువలు.. సంప్రదాయాలు లాంటివి తుంగలోకి తొక్కేసి.. తాము మద్దతు ఇస్తున్న వారి తరఫున వకల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడటం.. వాదనలు వినిపించటం ఎక్కువైంది. ఇప్పుడు అలాంటి ఒక అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తాజాగా నోటిఫికేషన్ విడుదలైన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల నుంచి విపక్ష టీడీపీ తప్పుకుంటున్నట్లుగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేసి భంగపడే కంటే.. పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమన్నట్లుగా ఆయన నిర్ణయం ఉంది. ఏరి కోరి రాష్ట్ర ప్రభుత్వం.. తన సలహాదారునే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చోబెట్టిన వేళలో.. తాము బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతారు.

దీంతో.. స్థానిక ఎన్నికల నుంచి తాము తప్పుకుంటున్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మంచి నిర్ణయమా? చెడ్డ నిర్ణయమా? పార్టీని దారుణంగా డ్యామేజ్ చేసేంతటి పిచ్చి నిర్ణయమా? అంటూ పెద్ద చర్చనే చేస్తున్నాఅధికారపార్టీకి చెందిన నేతలు. సాపేక్షంగా చూస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసినా.. తుది ఫలితం ఎలా ఉంటుందో తెలిసినప్పుడు.. అన్యాయం జరిగిందన్న ఆరోపణలు చేసినా.. దాని మీద చర్యలు అంతంతమాత్రంగా ఉంటాయని విపక్షం నమ్ముతున్న వేళ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం తప్పేం కాదు.

అయితే.. ఎన్నికల్లో పోటీ చేయకపోవటం.. చారిత్రక తప్పుగా కొందరు అభివర్ణిస్తున్నారు. బాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యా సదృశం అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే.. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు.. అనుకూల పవనాలు వీయనప్పుడు పోటీలోకి దిగే కంటే.. దూరంగా ఉండటం మంచిదన్నది మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళలో వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాటి ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పోటీలోకి దిగకపోవటాన్ని మర్చిపోకూడదు.

ప్రజల్లో బలం ఉండటం వేరు. ఆ బలం ఎన్నికల్లో అనుకూల ఓటుగా మారటం వేరన్నిమర్చిపోకూడదు. తనకు అనుకూలంగా లేనప్పుడు మూర్ఖంగా ఎన్నికల బరిలోకి దిగే కన్నా.. దూరంగా ఉండటమే మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ముఖం పగిలిపోవటమే కాదు.. పార్టీలోనూ.. క్యాడర్ లోనూ ఆత్మవిశ్వాసం ఆవిరి అవుతుంది. అలాంటప్పుడు బరిలోకి దిగే కన్నా.. దూరంగా ఉండటే చాలా మంచిదని చెప్పక తప్పదు.