Begin typing your search above and press return to search.

కోడెల శవరాజకీయం.. టీడీపీ బుక్కైంది..

By:  Tupaki Desk   |   18 Sept 2019 12:01 PM IST
కోడెల శవరాజకీయం.. టీడీపీ బుక్కైంది..
X
కోడెల శవ రాజకీయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయన అనుంగ టీడీపీ నేతలు - పచ్చమీడియా దిగ్విజయంగా చేస్తోంది. కోడెల బతికున్నప్పుడు కేటాక్స్ బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేసినప్పుడూ బాబు సహా ఏ నేత కోడెలకు అండగా నిలవలేదు. ఆయనపై వరుసగా బాధితులు కేసులు నమోదు చేసినప్పుడు స్పందించలేదు. ఇక కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ దొంగిలించాడన్న అపవాదు వచ్చినప్పుడు ఆ పెంట మనకు అంటుకుంటుందని కోడెలను ఒంటరిగా వదిలేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామని కూడా చంద్రబాబు అండ్ కోటరీ ఆలోచించారని వార్తలు వచ్చాయి. కోడెల విషయంలో తలదూర్చితే ఆయన అవినీతి - అక్రమాలు తమకూ అంటుకుంటాయని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆయన వద్దకు వెళ్లలేదు.. భరోసా ఇవ్వలేదు.. కనీసం పలకరించిన పాపాన పోలేదు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు కోడెల ఆత్మహత్య చేసుకోగానే ఆయన శవంతో రాజకీయం చేసే ఎత్తుగడ వేస్తున్నారన్న విమర్శలు వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుది మొసలికన్నీరే అంటూ మంత్రులు బొత్స - కొడాలి నానిలు విమర్శిస్తున్నారు.

కోడెల చేసిన అక్రమాలన్నీ కళ్లముందే ఉన్నాయి. ఆ సమయంలో ఆయనను కనీసం టీడీపీ నేతలు - నాయకులు తమ వాడిగా చెప్పుకునేందుకు కూడా ఒప్పుకోలేదు. స్వయంగా కోడెల సొంతూరు నర్సారావుపేటలోనే ‘కోడెల వద్దు.. చంద్రబాబు ముద్దు’ అంటూ కోడెలను వెలివేయాలని టీడీపీ నేతలు ధర్నాలు - ఆందోళనలు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నాడు కోడెలను వద్దని స్వయంగా టీడీపీ నేతలే దూరం జరిగారు. ఇప్పుడు 35 ఏళ్లుగా నమ్మిన పార్టీ తనను పట్టించుకోకపోవడం.. కేసులు చుట్టుముట్టడంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల ఆత్మహత్యలో కేసులు ఎంత ప్రభావం చూపాయో.. అదే స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు - ఆ పార్టీ నేతలు పెట్టిన దూరం.. వెలివేసిన తీరు కూడా కోడెలను మనస్థాపానికి గురిచేశాయని. ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాయనే విమర్శలు ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోడెల చనిపోగానే ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టి శవరాజకీయం చేస్తున్న టీడీపీ తీరు విస్తుగొలుపుతోందంటున్నారు.

అందుకే తాజాగా టీడీపీ డ్రామాలు.. కోడెలను ఎలా టీడీపీ నేతలు కాలదన్నరనే నిజాలపై కొందరు నెటిజన్లు వీడియోలను విడుదల చేసి టీడీపీని ఎండగడుతున్నారు. ‘కోడెల వద్దు.. చంద్రబాబు ముద్దు’ అని స్వయంగా టీడీపీ నేతలే ధర్నాలు చేసిన వీడియోలను చూపించి టీడీపీని ఎండగడుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ నేతల బండారం బయటపెడుతున్న ఈ వీడియోలు సంచలనంగా మారాయి..


వీడియో కోసం క్లిక్ చేయండి