Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దుపై టీడీపీ స‌ర్వేలో ఏం తేలిందంటే...

By:  Tupaki Desk   |   22 Dec 2016 12:30 AM GMT
నోట్ల ర‌ద్దుపై టీడీపీ స‌ర్వేలో ఏం తేలిందంటే...
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కేంద్రంలోని బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ క‌ష్టాలు తప్పేలా క‌నిపించ‌డం లేదు. టీడీపీ ఆధ్వర్యంలో తరచూ నిర్వహించే సర్వేల్లో భాగంగా ఈసారి నోట్ల రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో నోట్ల రద్దుపై ప్రజలు హర్షం వ్యక్తం చేసినా పెద్దవారికి కలగాల్సిన కష్టాలు సామాన్యుడికి ఎదురవడం ప్రభుత్వ వైఫల్యమేనని అభిప్రాయపడ్డట్లు సమాచారం. ప్రజల్లో సానుకూల అభిప్రాయం వచ్చినా సామాన్యుడికి కరెన్సీ కష్టాలు ఎదురవడంపై మాత్రం అసహనం వ్యక్తమైనట్లు తెలుగుదేశం పార్టీ సర్వేలో స్పష్టమైంది. దీంతో జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో నిర్వహిస్తే మంచిదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం.

తాత్కాలికంగా నాలుగైదు రోజులైతే తాము కూడా ఓపిక వహించే వారమని ఏకంగా నెలరోజులు దాటినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని ప్రజలు మండిపడ్డట్లు నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజల నుంచి సానుకూలత లభించేదని సర్వే సంస్థలు టీడీపీ అధినేతకు ఇచ్చిన నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం రాష్ట్రంలో మిత్రపక్షం టీడీపీపై కూడా ఉందని అదే సమయంలో వైసీపీకు కూడా అనుకూల ధోరణి కనిపించలేదని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తే చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సర్వే నివేదిక అందుకున్న సీఎం చంద్రబాబు జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఫిబ్రవరికి వాయిదా వేస్తే బాగుంటుందన్న ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/