Begin typing your search above and press return to search.

జగన్ మీదకు టీడీపీ స్లోగన్... ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 2:00 PM IST
జగన్ మీదకు టీడీపీ స్లోగన్... ?
X
జగన్ ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయనకు 151 సీట్లు వచ్చాయి. అంతేనా లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం గెలుచుకున్నారు. ఇప్పటికి వైసీపీ పాలన ఇంటర్వెల్ దాకా వచ్చింది. మరో సగం పూర్తి కావాలి. ఈలోగా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏమో ఎవరికీ తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలి అన్నదే చంద్రబాబు ఆలోచన. దాని కోసం అపర చాణక్యుడు తన మెదడుకు పదును పెడుతున్నారు. కొత్త ఎత్తులు ఎన్నో వేస్తున్నారు. ఏపీలో జనాలను తన వైపునకు ఎలా తిప్పుకోవాలో కూడా ఆలోచిస్తున్నారు.

అలా మధించగా వచ్చిన గన్ లాంటి స్లోగన్ ఒకటి ఉందిట. అదే జగన్ మీద ప్రయోగించబోతున్నారుట. అదేంటి అంటే జగన్ కి అసలు పాలనానుభవం లేదు, ఆయన ఏలుబడి వల్ల ఏపీ కచ్చితంగా మరో రెండు దశాబ్దాల పాటు వెనక్కిపోయింది. ఇప్పటికే విభజన కష్టాలతో ఉన్న ఏపీని జగన్ సర్వనాశనం చేశారు. అప్పులు కుప్పలుగా తెచ్చి మరీ ఏపీకి దారీ తెన్నూ లేకుండా చేశారు. జగన్ ఏలుబడిలో ఒక్క అభివృద్ధి కార్యక్రం కూడా లేదు. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. ఇలాగే ఏపీని వదిలేస్తే మాత్రం భావి తరాలు దారుణంగా నష్టపోతాయి. జగన్ని ఎంత తొందరగా గద్దె దించితే అంత ఎక్కువగా ఏపీకి మేలు జరుగుతుంది.

ఇదే టీడీపీ మార్క్ స్లోగన్ గా ఉండబోతోందిట. దీనితో పాటు చంద్రబాబు అయిదేళ్ల పాలనను కూడా పోలిక పెడతారట. బాబు హయాంలో అనంతపురం లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతంలో కూడా కియా మోటార్స్ ఫ్యాక్టరీ వచ్చిందని, చిత్తూరులో శ్రీ సిటీ వచ్చిందని, విశాఖ లాంటి చోట్ల ఐటీ అభివృద్ధికి బాటలు వేశామని కూడా చెప్పుకుంటారుట. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వారి నాయకత్వంలో నాడు ఏపీ ఉంది కాబట్టే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు అంతా ముందుకు వచ్చారని కూడా చెబుతారట.

జగన్ కి ఏమీ తెలియదు, ఆయన వల్ల ఏపీ అసలు ప్రగతి బాట పట్టదు, ఆయన్నే మళ్ళీ ఎన్నుకునే తప్పు చేయ‌వద్దు అనబోతోంది టీడీపీ. ఇక ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం జగన్ దే అని కూడా మరో ఘాటు విమర్శ కూడా టీడీపీ నుంచి వస్తోంది. మొత్తానికి వైసీపీకి ఒకసారి చాన్స్ ఇచ్చారు, మళ్లీ ఇవ్వవద్దు, ఏపీని ముంచవద్దు అంటూ ప్రజలకు వినతిపూర్వకంగానే చెబుతూ అందులోనే మొత్తం జగన్ పాలనను ఎండగట్టబోతున్నారుట. టీడీపీ పేల్చబోతున్న ఈ స్లోగన్ కనుక హిట్ అయితే మాత్రం వైసీపీ చాప్టర్ క్లోజ్ అని పసుపు శిబిరం వ్యూహకర్తం చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ని దించడానికి ఈ స్లోగన్ వజ్రాయుధమే అని టీడీపీ గట్టిగా భావిస్తోంది.