Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలకు ఓట్లడగాలంటే భయమేస్తోందట..

By:  Tupaki Desk   |   4 March 2017 7:46 AM GMT
టీడీపీ నేతలకు ఓట్లడగాలంటే భయమేస్తోందట..
X
ప్రత్యక్ష ఎన్నికలంటే నాయకులకు వెన్నులో వణుకుపుడుతోందా...? ఒకప్పుడు వరుస విజయాలు సాధించినవారు కూడా ఇప్పుడు బ్యాలట్ బరిలో దిగేందుకు వెనుకాడుతున్నారా..?

కొద్దికాలంగా నేతల తీరు చూస్తుంటే ఇది ముమ్మాటికీ నిజమని అర్థమవుతోంది. గతంలో ఎన్నిసార్లు గెలిచినా ఆ తరువాత ఒకట్రెండు పరాజయాలు ఎదురైతే చాలు ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఎన్నికలంటే భయపడుతున్నారు. రిస్కు తీసుకోకుండా చట్టసభలకు ఎన్నికై సేఫ్ జోన్లోకి వెళ్లిపోవాలని ట్రయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ టీడీపీలో సీనియర్ నేతల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడం కష్టమని అనిపించినప్పుడు రాజ్యసభ సీటుకు... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్సుందని అనిపిస్తే ఎమ్మెల్సీ సీటుకు గురిపెడుతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనా మంత్రి పదవి సంపాదించుకోవచ్చు.. పైగా ఎమ్మెల్యే ఎన్నికలతో పోల్చితే ఖర్చు కూడా తక్కువ. మెంటల్ టెన్షన్ కూడా తక్కువే. ఇలాంటి లెక్కలతోనే నేతలంతా ఎమ్మెల్సీ సీట్ల కోసం తెగ తాపత్రయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భయం కూడా చాలామందిలో ఉందని.. అందుకే టీడీపీలో ఎమ్మెల్సీ సీట్లకు వందలమంది పోటీ పడుతున్నారని అంటున్నారు.

ఇక జాతీయ స్థాయిలో వ్యాపారాలు - కాంట్రాక్టులు చేసే బడా వ్యాపారవేత్తలు - పారిశ్రామికవేత్తలుగా ఉన్న నేతలైతే రాజ్యసభ టిక్కెట్లు కావాలని కోరుకుంటున్నారు. టిక్కెట్ కోసం ఎంతయినా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. లోక్ సభ టిక్కెట్ అయినా డబ్బుతో ముడిపడిన వ్యవహారమే.. ఆ తరువాత లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల ఖర్చు కూడా చాలావరకు భరించాల్సి వస్తుంది. ఇంతా చేస్తే గెలుస్తామో లేదో చివరి వరకు టెన్షన్. అందుకే రాజ్యసభకు వెళ్తే హోదాహోదా.. రిస్కు తక్కువ అనుకుంటున్నారు. ఎటూ ఎంపీగా ఉంటారు కాబట్టి ఢిల్లీలో తమ వ్యాపారాలకు సంబంధించిన పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు. పైగా రాజ్యసభకు వెళ్తే మధ్యలో గవర్నమెంటు పడిపోయినా మన పదవికి ఢోకా ఉండదు.. లోక్ సభ ఎంపీ కంటే అదనంగా ఒక సంవత్సరం పదవీకాలం బోనస్. కాలం కలిసొస్తే కేంద్రంలో మంత్రి కూడా కావొచ్చు. ఇదీ సీనియర్ నేతల స్కెచ్.

రీసెంటుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు టీడీపీలో ఎంతమంది పోటీపడ్డారో తెలిసిందే. అందులో గతంలో మంత్రులుగా పనిచేసినవారు.. ఎన్నోసార్లు ఎన్నికల బరిలో గెలిచినవారు కూడా ఉన్నారు. శత్రుచర్ల విజయరామరాజు - చిక్కాల రామచంద్రరావు వంటివారు గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఘనాపాఠిలే కానీ.. ఇప్పుడు మాత్రం సేఫ్ జోన్లోకి రావాలని కోరుకుంటూ ఎమ్మెల్సీగా మారుతున్నారు. ఆనం బ్రదర్స్ - ఇంకా పలువురు సీనియర్ లీడర్లు కూడా ఈ కోటాలో సీట్లను ఆశించారు. అలాగే ఎమ్మెల్యేల కోటాలో సీట్ల కోసం హేమాహేమీలంతా పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల కోటా అయితే ఇంకా సేఫ్. పక్కాగా సంఖ్యా బలం బట్టి విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ఈ కోటాలో సీటు కోసం కూడా సీనియర్ నేతలు పోటీపడడం చూస్తుంటే వీరందరికీ ప్రత్యక్ష ఎన్నికలంటే ఇంత భయం ఎందుకు అన్న అనుమానం వస్తోంది.

2014 ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ లీడర్లు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి - పయ్యావుల కేశవ్ - గాలి ముద్దుకృష్ణమనాయుడు - ప్రతిభాభారతి వంటివారు కూడా ఇప్పటికే ఎమ్మెల్సీలైపోయారు. ఓడిపోయిన చోట మళ్లీ ప్రజల మద్దతు కూడగట్టడం మానేసి ఈజీ రూట్లో చట్ట సభకు వెళ్లడం - మంత్రికావడంపైనే వీరంతా దృష్టి పెడుతున్నారు. పయ్యావుల వంటి నేతలు రాజకీయంగా యువకులే అయినప్పటికీ అప్పుడే కాడి పక్కనపడేశారన్న విమర్శలున్నాయి.

అందరికంటే ముందుజాగ్రత్త యనమలది..

సేఫ్ పాలిటిక్సు కోసం సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల రూటు పట్టడమన్న ట్రెండు యనమలతోనే మొదలైంది. 2014 ఎన్నికలకు ముందు ఈసారి విజయం టీడీపీదే అంటూ ఎక్కడికక్కడ ఊదరగొట్టిన ఆయన ఎన్నికల్లో మాత్రం నిలబడలేదు. అధికారం లేని కాలంలోనే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం అండగా ఎమ్మెల్సీ అయిపోయి హమ్మయ్య అనుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం కాగానే ఆర్థిక మంత్రి అయిపోయారు. రిస్కు లేకుండా - ఖర్చు లేకుండా కీలక పదవి కొట్టేశారు. అదే ఆయన తన నియోజకవర్గం తుని నుంచి కనుక పోటీ చేసి ఉంటే ఓటమి తప్పేది కాదనే రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2014లో తునిలో యనమల సోదరుడినే బరిలో దించారు. ఆయన వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ యనమల రామకృష్ణుడు బరిలో దిగినా మెజారిటీ కాస్త అటూఇటూ మారినా ఆయనకు అదే ఓటమి ఎదురయ్యేది. 1989 నుంచి 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చిన యనమల 2009లో తొలిసారి ఓడిపోయారు. దాంతో 2014లో ఆయన రిస్కు తీసుకోదలచుకోకుండా మెల్లగా ఎమ్మెల్సీ సీటుకు గురిపెట్టి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయి సేఫ్ జోన్లోకి వచ్చేశారు.

టీడీపీ సీనియర్ నేతలంతా ఇప్పుడు యనమలే ఆదర్శంగా అదే రూట్లో పయనించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలయితే తమ వారసులకు తమ స్థానాలు ఇచ్చేసి తాము పెద్దల సభకు వెళ్లిపోవాలని.. లేకున్నా కూడా పెద్దల సభకు ఎన్నికై మంత్రులై నియోజకవర్గాలు - జిల్లాల్లో పెత్తనం కొనసాగించాలని కోరుకుంటున్నారట. కానీ.. ప్రజల్లోకి వెళ్లి ఓట్లడగాలంటే మాత్రం భయపడిపోతున్నారట.

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/