Begin typing your search above and press return to search.

తమ్ముళ్లు సైకిల్ దిగుతారా...

By:  Tupaki Desk   |   24 Aug 2018 6:20 AM GMT
తమ్ముళ్లు సైకిల్ దిగుతారా...
X
తెలుగుదేశం పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యకర్తలే ఆలంబనగా ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహా నటుడు ఎన్.టి.రామారావు కార్యకర్తలే దేవుళ్లుగా... కాంగ్రెస్ పార్టీ దెయ్యంగా భావించి పార్టీని నిర్మించారు. ఆయన బతికి ఉన్నంత వరకూ అలాగే కొనసాగింది కూడా. ఆయన మరణానంతరం పార్టీలో వచ్చిన కుదుపులతో చాలా మంది సీనియర్ నాయకులు - కార్యకర్తలు మనస్థాపానికి గురయ్యారు. ఇదేంటి అంటూ పలువురి దగ్గర వాపోయారు. అయితే ఆనాటి పరిస్థితులకు వారంతా తలవొగ్గారు. ఎన్.టి.ఆర్ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నీ తానై వ్యవహరించారు. ఆయనకు కొందరు పెద్దలు కూడా ఇతోధికంగా సహకరించారు. ఇక మీడియా గురించి చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో కొన్నాళ్లు - ప్రతిపక్షంలో కొన్నాళ్లు గడిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చీలిక వ్యవహారంలో కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి జిమ్మిక్కులతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారనే కోపం సీనియర్ నాయకుల్లోనూ - కార్యకర్తల్లోనూ నానాటికి పెరిగిపోతోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు - మహా నటుడు ఎన్.టి.రామారావుపై ఉన్న గౌరవాభిమానాలు - ఆయన కాంగ్రెస్ పార్టీతో వ్యవహరించిన తీరుతో నాయకులు - కార్యకర్తలు ఇంత వరకూ పెదవి విప్పలేదు. ఇప్పుడు అనివార్యంగా వారంతా తమ గళాన్ని వినిపించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడి ఒంటెత్తు పోకడలే అని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అధికారం కోసం తమందరికి శత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకున్న చంద్రబాబు నిర్ణయం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పొత్తు నిర్ణయాన్ని ఖరారు చేస్తే వారంతా తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్ నాయకులు పలువురు లోపాయికారిగా చర్చించుకుంటున్నారని, అందులో భాగంగానే చింతకాయల అయ్యన్న‌ పాత్రుడు - కె.ఈ.క్రష్ణమూర్తి వంటి నాయకులు బహిరంగంగానే చంద్రబాబు నాయుడ్ని వ్యతిరేకించారనేే వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కీలక సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను చంద్రబాబు నాయుడికి తెలియజేయాలని, కాంగ్రెస్ పొత్తుకు తాము ససేమిరా అంగీకరించమని స్పష్టం చేయాలని వారంతా నిర్ణయించుకున్నట్లు అమరావతిలో గుప్పుమంటోంది. తమ మాట కాదని కాంగ్రెస్‌ తో కలిస్తే పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉండాలని కొందరు నాయకులు తమ కార్యకర్తలకు సూచించినట్లు చెబుతున్నారు.