Begin typing your search above and press return to search.

అఖిల ప్రియపై ఆగ్రహిస్తున్న సీనియర్లు

By:  Tupaki Desk   |   30 April 2017 6:32 AM GMT
అఖిల ప్రియపై ఆగ్రహిస్తున్న సీనియర్లు
X
తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన భూమా అఖిల ప్రియ మంత్రి అయ్యాక మారిపోయారా... ఆమె రాటుదేలారా లేదంటే పదవీగర్వం వచ్చిందా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడం, కేబినెట్‌ లో అందరికి కంటే తక్కువ వయస్కురాలు కావడంతో అందరూ ఆమె పట్ల సానుభూతితో వ్యవహరించేవారు. అయితే భూమా అఖిల ప్రియ మంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు బాగుండడం లేదని సీనియర్ నేతలు అంటున్నారు. ఇటీవల భూమా అఖిలప్రియ వ్యవహార శైలితో ఉప ముఖ్యమంత్రి కూడా నొచ్చుకున్నారట.

డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను కూడా భూమా అఖిలప్రియ లెక్కచేయలేదట. ఆయన ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనకు రాగా ఆమె కనీసం పట్టించుకోలేదట. ఉప ముఖ్యమంత్రి వస్తున్న విషయాన్ని అధికారులు ముందుగానే అఖిలప్రియకు తెలియజేశారు.కానీ అఖిలప్రియ మాత్రం చినరాజప్పకు కనీసం స్వాగతం పలికేందుకు కూడా వెళ్లలేదు. అఖిలప్రియ తీరుపై డిప్యూటీ సీఎం ఆరా తీసి మనస్తాపానికి గురైనట్టు చెబుతున్నారు.

జిల్లాలో ఇతర నేతలనూ భూమా అఖిలప్రియ మంత్రి అయ్యాక అస్సలు లెక్కచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో ఆమె వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమంటున్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్ రాకముందే అఖిలప్రియే సమావేశాన్ని ప్రారంభించేశారు. చైర్ పర్సన్‌ వచ్చే లోపు తాను మాట్లాడేసి… మిగిలిన వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా తనకు కర్నూలులో పని ఉందంటూ అఖిలప్రియ వెళ్లిపోయారు. మీరు మాట్లాడేసి వెళ్లిపోతే ఎలా… తాను చెప్పే సమస్యలను వినాలి కదా అంటూ చైర్‌ పర్సన్‌ - కౌన్సిలర్లు నిలదీశారు. అయితే అఖిలప్రియ మాత్రం లెక్క చేయలేదు. ఆమె దోరణి చూసి భూమా అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు. సీనియర్లను లెక్కచేయకపోవడం వల్ల భవిష్యత్తులో ఆమె ఒంటరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/