Begin typing your search above and press return to search.

శాప్ చైర్మన్ గా బైరెడ్డి: నామినేటెడ్ పదవులపై టీడీపీ సెటైర్లు

By:  Tupaki Desk   |   17 July 2021 4:30 PM GMT
శాప్ చైర్మన్ గా బైరెడ్డి: నామినేటెడ్ పదవులపై టీడీపీ సెటైర్లు
X
ఏపీలో జగన్ సర్కార్ ఇవాళ ప్రకటించిన నామినేటెడ్ పదవులపై వైసీపీ వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం పెదవి విరిచింది. నామినేటెడ్ పదవులతో సామాజిక న్యాయం చేశామని జగన్ ఓ వైపు చెబుతుండగా.. అవన్నీ ఉత్సవ విగ్రహాలైన పోస్టులని.. నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీలేని చైర్మన్లు అంటూ టీడీపీ ఎద్దేవా చేసింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పేరుతో హడావుడి చేస్తోంది తప్పితే పెద్దగా ఉపయోగం లేదని టీడీపీ నేత జవహర్ అన్నారు. దాదాపు 26 కీలక సంస్థలకు చైర్మన్లుగా సొంత సామాజికవర్గ నేతలను నియమించి పల్లకీలో ఊరేగిస్తున్నారని విమర్శించారు. అప్రధాన్య పోస్టులను బడుగు, బలహీన వర్గాలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.

ఇక టీటీడీ చైర్మన్ పదవిని మళ్లీ బాబాయ్ కే కేటాయించడం బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించడమా? అని జవహర్ నిలదీశారు. బడుగులు టీటీడీ చైర్మన్ పదవికి పనికిరారా? అని జవహర్ ప్రశ్నించారు. నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీల్లేని చైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగిందో సీఎం సమాధానం చెప్పాలన్నారు.

గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాల అడ్రస్ లే ఇంతవరకు తెలియదని.. ఇప్పుడు ప్రకటించే పదవుల కార్యాలయాల అడ్రస్ చెప్పి తర్వాత చైర్మన్లను నియమించాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత జవహర్ డిమాండ్ చేశారు. నిధులు, విధులు లేని చైర్మన్ల నియామకంతో వారిని ఉత్సవ విగ్రహాల్లా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని అసంతృప్తితో ఉన్న వారిని సంతృప్తి పరచడం కోసమే తప్ప... బీసీల బతుకులు మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

-యువ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ అందలం
యువకుడు, ఉత్సాహ వంతుడైన వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సీఎం జగన్ అందలం ఎక్కించారు. ఏకంగా ఈ యువ నేతకు రాష్ట్ర స్తాయి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిలో నియమించారు.

కర్నూలు జిల్లా నందికొట్కూర్ నుంచి ఆర్థర్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అప్పటికే అక్కడ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. జగన్ కోరిక మేరకు సీటును ఆర్థర్ కు త్యాగం చేశాడు. ఆర్థర్ తో విభేదాలున్నా కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సీటు త్యాగం చేసిన బైరెడ్డికి జగన్ ఈ రాష్ట్ర స్థాయి కేబినెట్ పదవి ఇవ్వడం విశేషం.

రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి సీఎం వైఎస్ జగన్ ప్రజల్లో హామీ ఇచ్చిన నాయకులు కొంతమంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరికి మాత్రమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో ఒకరు చల్లా రామకృష్ణారెడ్డి మరొకరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. చల్లా రామకృష్ణా రెడ్డికి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గెలుపు విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి జగన్ తాజాగా శాప్ చైర్మన్ పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక మైన పదవి ఇవ్వాలని జగన్ అప్పట్లోనే అనుకున్నా సాధ్యపడలేదు. కర్నూలు జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా.. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం బైరెడ్డికే సపోర్టు చేస్తుండడం విశేషం. మూడు కీలకమైన పదవుల్లో ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ కేటాయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బైరెడ్డి మంచి వక్త.. రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ చేసిన కృషిని తన వాక్చాతుర్యంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్తాడనే నమ్మకం వైసీపీలో ఉంది. ఆ నమ్మకంతో వైఎస్ జగన్ ఈ యువనేతకు పెద్ద పదవి ఇచ్చినట్టు చెబుతున్నారు.