Begin typing your search above and press return to search.

వైసీపీ సవాలుకు టీడీపీ విచిత్రమైన స్పందన

By:  Tupaki Desk   |   27 March 2021 4:45 AM GMT
వైసీపీ సవాలుకు టీడీపీ విచిత్రమైన స్పందన
X
తెలుగుదేశంపార్టీ వాదన ఎప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళతో వాదనకు దిగలేనపుడు చంద్రబాబునాయుడు కావచ్చు లేదా టీడీపీ సీనియర్ నేతలు ఎవరైనా సరే అసలు ఇష్యుకి సంబంధంలేని వాదనలతో పలాయనవాదాన్ని పాటిస్తారు. తాజాగా అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందనేది వైసీపీ ఆరోపణ.

ఈ విషయంలో విచారించేందుకు ప్రభుత్వం చంద్రబాబు - మాజీమంత్రి నారాయణకు నోటీసులు కూడా జారీచేసింది. అయితే విచారణకు హాజరుకాకుండా వాళ్ళిద్దరు హైకోర్టుకెక్కి స్టే తెచ్చుకున్నారు. అయితే ఇదే విషయమై తాజాగా సీనియర్ నేత దూళిపాళ నరేంద్ర అండ్ కో మాట్లాడుతు అసైన్డ్ భూముల కుంభకోణం జరగలేదనటానికి ఆ ప్రాంతంలోని కొందరు రైతులతో గడచిన నాలుగురోజులుగా వీడియో ఇంటర్వ్యూలు రిలీజ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఫిర్యాదుచేసిన ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆళ్ళ స్పందించారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి తనతో బహిరంగ చర్చకు రావాలంటు చంద్రబాబు, నారాయణలను సవాలు చేశారు. కుంభకోణం ఏ స్ధాయిలో జరిగిందో, ఎవరెవరు పాత్రదారులో ? ఎవరెవరు లబ్దిపొందారనే విషయాలను తాను నిరూపిస్తానంటూ సవాలు విసిరారు. మామూలుగా అయితే చంద్రబాబు - నారాయణ ఈ సవాలును స్వీకరించాలి. లేదా వాళ్ళ తరపున మరెవరైనా కూడా సవాలును స్వీకరించచ్చు.

అయితే సీనియర్ నేత నరేంద్ర స్పందిస్తు ఆళ్ళ సవాలుపై మాట్లాడకుండా విశాఖపట్నంలో గడచిన రెండేళ్ళుగా జరిగిన భూకుంభకోణాలను ప్రస్తావించటం విచిత్రం. విశాఖలో రూ. 15 వేల కోట్ల భూ దోపిడికి వైసీపీ కుట్ర చేసిందన్నారు. భూముల స్కాం అమరావతిలో కాదని వైజాగ్ లో జరిగిందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి అండ్ కో ఇప్పటికే వేలాది ఎకరాలను దోచేసినట్లు ఆరోపించారు. వైజాగ్ ను రాజధానిగా ప్రకటించకముందే ఎన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి, తర్వాత ఎన్ని జరిగాయో లెక్క తేల్చాలంటు డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆళ్ళ డిమాండ్ చేసినట్లు అమరావతి స్కాంపై చర్చకు రెడీ అయితే విశాఖ ల్యాండ్ స్కాం మీద కూడా చర్చ జరపవచ్చు కదా. రెండుపార్టీల నేతలు చర్చకు దిగితే ఎవరి వాదనేమిటో ? ఎవరు తప్పుచేశారో జనాలకు కూడా కాస్త అర్ధమవుతుంది. అలాకాకుండా ఆళ్ళ అమరావతి స్కాం గురించి సవాలు చేస్తుంటే నరేంద్ర మాత్రం విశాఖలో భూ స్కాం అంటు మాట్లాడటమే విచిత్రం. ఇదేకాదు సమాధానం చెప్పుకునే స్ధితిలో లేనపుడు మొదటినుండి తమ్ముళ్ళు చంద్రబాబు పద్దతినే ఫాలో అవుతారంతే.