Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోట బీట‌లు వారుతోంద‌ట‌!

By:  Tupaki Desk   |   7 July 2017 5:02 AM GMT
టీడీపీ కంచుకోట బీట‌లు వారుతోంద‌ట‌!
X
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా ఏద‌న్నా ఉందంటే... అది ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జిల్లా చిత్తూరు కాదు. ఇక బాబు సామాజిక వ‌ర్గం అధికంగా ఉన్న కృష్ణా జిల్లా అస‌లే కాదు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లానే టీడీపీ కంచుకోట‌గా నిలిచింద‌ని చెప్పాలి. ఎందుకంటే... ఆ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ స‌భ సీట్లుంటే... వాటిలో ఏ ఒక్క దానిలోనూ వైసీపీ విజ‌యం సాధించ‌లేదు. ఏకంగా 14 అసెంబ్లీ సీట్ల‌ను గెలుచుకున్న టీడీపీ... త‌న మిత్ర‌ప‌క్షం బీజేపీ అభ్య‌ర్థిని మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో గెలిపించుకుంది. ఇక ఎంపీ స్థానాల విష‌యానికి వ‌స్తే... ఉన్న మూడింటిలో రెండింటిలో త‌న అభ్య‌ర్థుల‌ను మ‌రో సీటులో బీజేపీ అభ్య‌ర్థిని ఆ పార్టీ గెలిపించుకుంది. వెర‌సి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట కిందే లెక్క‌.

ప్ర‌స్తుతం జిల్లాలో టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలుండ‌గా... వారిలో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులిచ్చిన చంద్రబాబు... బీజేపీకి ద‌క్కిన స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యేకు కూడా త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఇక చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా... టీడీపీ కంచుకోట‌గా నిలిచిన జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి అని... ఆ జిల్లాలో ప‌నిచేసిన పార్టీ నేత‌ల్లా మిగిలిన జిల్లాల నేత‌లు కూడా ప‌నిచేయాల‌ని ప‌లుమార్లు చెప్పారు. చంద్ర‌బాబు లెక్క‌లేన‌న్ని సార్లు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, క‌ర్నూలు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు కూడా బోలెడ‌న్ని ఉన్నాయి. సొంత పార్టీ నేత‌లు నొచ్చుకునే విధంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను చాలా లైట్ తీసుకున్న చంద్ర‌బాబు త‌న‌దైన ప్రేమ‌ను ప‌శ్చిమ గోదావ‌రిపై కురిపిస్తూనే వ‌చ్చారు.

మ‌రి అలాంట‌ప్పుడు ఏడాదిన్న‌ర త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ జిల్లా ప్ర‌జ‌లంతా తిరిగి టీడీపీ వైపే మొగ్గాలి. మ‌రి ఇప్పుడు అక్క‌డ ఆ పరిస్థితి ఉందా? అంటే... ముమ్మాటికీ లేద‌నే చెప్పాలి. అదేంటి అంటే... గెలుపు త‌ల‌కెక్కిన ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్ర‌జ‌ల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతటితో ఆగితే బాగుండేదేమో... ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసిన తెలుగు త‌మ్ముళ్లు త‌మ‌లో తాము కుమ్ములాడుకుంటూ... ఒక‌రికి మ‌రొక‌రు అడ్డుపుల్ల‌లు వేసుకుంటున్నార‌ట‌. ఇక ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి టీడీపీ నేత‌లు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డ‌మే కాకుండా... త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు మంజూరైన నిధుల‌ను ఎలా త‌మ జేబుల్లో వేసుక‌యోవాల‌నే అంశానికే ప్రాధాన్య‌మిస్తున్నార‌ట‌. వెర‌సి వారంతా ప్ర‌జ‌ల‌కు దాదాపుగా దూర‌మ‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ వాద‌న‌ను బ‌య‌టకు తీసింది... విప‌క్ష వైసీపీనో, లేదంటే ఏ స్వ‌తంత్ర సంస్థ‌లో కాద‌ట‌. టీడీపీని భుజానికెత్తుకుని భ‌జ‌న చేస్తున్న ఆ పార్టీ అనుకూల మీడియా చేయించిన స‌ర్వేలో ఈ విషయం తేట‌తెల్ల‌మైంద‌ట‌. అంటే రానున్న ఎన్నిక‌ల్లో ఆ జిల్లా పూర్తిగా టీడీపీ వెంటే న‌డిచే అవ‌కాశాలేమీ లేవ‌ని ఇప్ప‌టికే రూఢీ కాగా... మొన్న ద‌ళితుల వెలితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థ‌ల పేప‌ర్లు, న్యూస్ ఛానెళ్ల‌లో ప‌తాక శీర్షిక‌లకెక్కిన గ‌ర‌గ‌ప‌ర్రు విష‌యాన్ని ఇప్పుడు ఆ జిల్లా వాసులు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. గ‌ర‌గ‌ప‌ర్రు గొడ‌వ స‌ద్దుమ‌ణుగుతున్న త‌రుణంలో పోలీసులు, టీడీపీ నేత‌లే మ‌ళ్లీ ఆజ్యం పోశార‌ని, ఫ‌లితంగా ఆ గ్రామంలో ఇప్ప‌టికీ ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లార‌లేద‌ని జిల్లా ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. అదే స‌మ‌యంలో కాస్త ఆల‌స్యంగానైనా గ‌ర‌గ‌ప‌ర్రుకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ్రామంలోని రెండు వ‌ర్గాలు కూడా ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యాన్ని కూడా ఇప్పుడు ప్ర‌ధానంగా ప్రస్తావించుకోవాల్సిందే.

అంతేకాకుండా... గ‌ర‌గ‌ప‌ర్రుకు వెళుతున్న జ‌గ‌న్‌ కు దారి వెంట అన్ని నియోజ‌కవ‌ర్గాల ప్ర‌జ‌లు భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికిన విషయం కూడా మ‌రిచిపోలేనిదే. అంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల‌కు టీడీపీపై ఉన్న భావ‌న చెరిగిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ మార్పు స్ప‌ష్టంగా క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక టీడీపీ అనుకూల మీడియా చేయించుకున్న స‌ర్వే ప్ర‌కారం... బీజేపీతో క‌లుపుకుని టీడీపీకి 60 శాతం మంది ప్ర‌జ‌లు ఓటు వేస్తే... సింగిల్ సీటు కూడా ద‌క్క‌ని వైసీపీకి ఏకంగా 40 శాతం మంది ప్ర‌జ‌లు మొగ్గుచూపారు. ఈ స‌ర్వేనే టీడీపీ కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు బీట‌లు వారుతున్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది.