Begin typing your search above and press return to search.

తెలంగాణాలో టీడీపీ చరిత్రగా మిగిలి పోవాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:59 AM GMT
తెలంగాణాలో టీడీపీ చరిత్రగా మిగిలి పోవాల్సిందేనా ?
X
తాజాగా వెల్లడైన గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే టీడీపీకి ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. ఇపుడు గ్రేటర్ పరిధిలో కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు. 150 డివిజన్లకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ 106 డివిజన్లలో పోటీ చేసింది. పోటీ చేసిన డివిజన్లలో ఒక్కచోట కూడా గెలవకపోవటమే అత్యంత విషాధం. గెలుపు కాదు కదా కనీసం ప్రత్యర్ధులకు ఒక్క డివిజన్లో గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

రాష్ట్ర విభజనతోనే తెలుగుదేశంపార్టీకి దుర్దినాలు మొదలయ్యాయి. నిజానికి ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలోనే టీడీపీ చాలా బలంగా ఉండేది. తెలంగాణాలోని బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు తోడు కమ్మ సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉడేవి. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుండే టీడీపీకి బ్యాడ్ టైం స్టార్టయ్యింది. 2014లో తెలంగాణాలో కేసీయార్, ఏపిలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు.

అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేసింది. గెలుపు అవకాశాలు లేదని తెలీసి టీడీపీ పోటీకి దిగింది. తమ అభ్యర్ధి వేం నరేంద్రరెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు ఓటుకునోటు వ్యూహం బెడిసికొట్టి వెలుగు చూడటం అప్పట్లో దేశంలో ఎంత సంచలనమైందో చెప్పక్కర్లేదు. దాని దెబ్బకు పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయినప్పటికి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు వెళ్ళిపోయారు. అప్పటి నుండే తెలంగాణాలో పార్టీని చంద్రబాబు పూర్తిగా వదిలేశారు. దాంతో పార్టీ పరిస్దితి దారంలేని గాలిపటం లాగ తయారైంది.

దానికితోడు టీడీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలందరినీ కేసీయార్ హోలుసేలుగా లాగేసుకున్నారు. అప్పటి నుండే పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. పార్టీ తరపున చెప్పుకోవటానికి పార్టీ తరపున ఇద్దరు ఎంఎల్ఏలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారంటే ఉన్నారంతే. హోలు మొత్తంమీద చూసుకుంటే పార్టీ తరపున ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే గొంతుకే లేకపోయింది. అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు కొందరు సీనియర్లున్నప్పటికీ వాళ్ళను పట్టించుకునే జనాలే లేరు.

పార్టీని చంద్రబాబే వదిలేసిన తర్వాత మిగిలిన నేతలు ఎంతమందున్నా ఉపయోగం లేదు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రులు కూడా టీడీపీకి ఓట్లేయలేదని తేలిపోయింది. ఏపిలోని కమ్మ సామాజికవర్గాన్ని గ్రేటర్లో ఎన్నికల్లో ప్రచారం చేయమని చంద్రబాబు అడిగినా ఎవరు చేయలేదని సమాచారం. సో జరిగినది చూసిన తర్వాత భవిష్యత్తులో టీడీపీ అంటే తెలంగాణాలో ఓ చరిత్రగా మిగిలిపోవటం ఖాయమని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎంతో ఉజ్వలంగా వెలిగిన ఓ పార్టీ చివరకు ఇలా చరిత్రగా మిగిలిపోవాల్సి రావటం విషాధమనే చెప్పుకోవాలి.