Begin typing your search above and press return to search.

టీడీపీ కి సంతోషమే కానీ ఇబ్బంది పెట్టే వ్యూహం ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:50 AM GMT
టీడీపీ కి సంతోషమే కానీ ఇబ్బంది పెట్టే వ్యూహం ?
X
తొందరలోనే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే 13 జిల్లాలు తొందరలోనే 26 జిల్లాలు అవబోతున్నాయి కదా. ఇలా పెరిగే జిల్లాల్లో ఒకదానికి ఎన్టీయార్ పేరు పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయటమంటే ప్రధానంగా ఎన్టీయార్ అభిమానులకు, ఎన్టీయార్ కుటుంబసభ్యులకు సంతోషమే కదా.

జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం టీడీపీకి కూడా సంతోషమ కానీ.. జగన్ కి ఈ క్రెడిట్ రావడం టీడీపీకి రుచించే అవకాశం తక్కువే. ఎందుకంటే రాష్ట్రానికి దాదాపు పదమూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఈ పనిచేయలేకపోవటం. చంద్రబాబు తలచుకునుంటే 2014-19 మధ్యనే కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టుండేవారే. ఎందుకంటే పాదయాత్ర సందర్భంగా 2018లో ఇదే విషయాన్ని జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రకటించారు.

తొందరలోనే ఎలాగూ జిల్లాలు పెరగబోతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటవుతోంది. కాబట్టి ఆ జిల్లాకు మచిలీపట్నం జిల్లాగానే పిలుస్తారు. ఇక రెండోదైన విజయవాడ పార్లమెంటు జిల్లాకు కొత్త పేరు పెట్టారు. ఎలాగూ నియోజకవర్గం కొత్త జిల్లాకు హెడ్ క్వార్టర్సే కాబట్టి ఎన్టీయార్ విజయవాడ పేరుతోనే జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు.

వచ్చే ఉగాది పండుగ నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని అంటున్నారు. ఉగాది అంటే తెలుగువాళ్ళకు కొత్త సంవత్సరం. ఎన్టీఆర్ పేరు పెట్టడానికి మరో ప్రధాన కారణం ఏమిటంటే తొందరలోనే ఎన్టీఆర్ శతజయంతి వస్తోంది. కాబట్టి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉగాదికి విజయవాడ కేంద్రానికి ఎన్టీయార్ పేరు పెట్టబోతున్నారట. జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టినందు వల్ల వైసీపీకి ఎంత లాభముంటుందో ఇప్పుడే చెప్పటం కష్టం.

అయితే టీడీపీని ఇరుకున పెట్టడానికి మాత్రం ఈ అంశం బాగా పనికొస్తుంది. ఎన్టీయార్ అల్లుడయ్యుండి కూడా చంద్రబాబు చేయని పనిని జగన్ చేసినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రచారాన్ని చంద్రబాబు, టీడీపీ, ఎన్టీయార్ కుటుంబసభ్యులు, ఎన్టీయార్ అబిమానులతో పాటు జిల్లా ప్రజలు కూడా కాదనేందుకు లేదు. మరి జగన్ వ్యూహాన్ని చంద్రబాబు అండ్ కో ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.