Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీకి అగ్నిప‌రీక్షే!

By:  Tupaki Desk   |   8 Feb 2019 1:13 PM IST
ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీకి అగ్నిప‌రీక్షే!
X
ఓ వైపు జ‌గ‌న్ జోరు మీదున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ సై అంటున్నారు. బీజేపీ - కాంగ్రెస్ కూడా త‌గ్గ‌ట్లేదు. వీటికి తోడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎంతో కొంత ఉండ‌క మాన‌దు! మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ మ‌ళ్లీ స‌త్తా చాటుతుందా? తిరిగి ప‌్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ప‌్ర‌స్తుతం ఈ అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అయితే - అసెంబ్లీ ఎన్నిక‌ల సంగ‌తి ప‌క్క‌న పెట్టండి. వాటి కంటే ముందే టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రూపంలో అగ్ని ప‌రీక్ష ఎదురవ్వ‌బోతోంది. ఈ ఎన్నిక‌ల‌తో జ‌నం నాడి తెలిసిపోతుంద‌ని.. టీడీపీకి ఈ ఎన్నిక‌లు అగ్ని ప‌రీక్షేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోక్ స‌భ‌ - అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వాటిని టీడీపీకి లిట్మ‌స్ టెస్ట్ గా అభివ‌ర్ణిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల‌కు మార్చి 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటికి ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న ఏ క్ష‌ణంలోనైనా వెలువ‌డే అవ‌కాశ‌ముంది. ఎనిమిదింటిలో ఐదు స్థానాల‌కు ఎమ్మెల్యేల కోటా కింద‌ - రెండింటికి గ్రాడ్యుయేట్ల కోటాలో - మ‌రో సీటుకు టీచ‌ర్ల కోటాలో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. బ‌లాబ‌లాల ప‌రంగా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ 4 ఎమ్మెల్సీ స్థానాల‌ను - వైసీపీ ఓ స్థానాన్ని గెల్చుకోవ‌డం దాదాపు లాంఛ‌న‌ప్రాయ‌మే.

టీచ‌ర్లు - గ్రాడ్యుయేట్ల కోటాల్లో జ‌రిగే ఎన్నిక‌లే అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. గ‌తంలో స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీల‌ను గెలిపించుకోగ‌లిగిన టీడీపీ.. గ్రాడ్యుయేట్లు - టీచ‌ర్ల కోటాలో మాత్రం బోల్తా ప‌డింది. దీంతో ఈ ద‌ఫా ఏం జ‌ర‌గ‌బోతోంద‌న‌ని అంతా ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు.

ఓట‌ర్లు గ్రాడ్యుయేట్లు - టీచ‌ర్ల కోటాలో జ‌రిగే ఎన్నిక‌ల్లో కృష్ణా - తూర్పు గోదావ‌రి - ప‌శ్చిమ గోదావ‌రి - గుంటూరు స‌హా మొత్తం 10 జిల్లాలకు చెందిన‌వారు ఓటుహ‌క్కు వినియోగించుకోబోతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఓట‌ర్ల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు - టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ మ‌హ‌మ్మ‌ద్ అహ్మ‌ద్ ష‌రీఫ్ ఏపీ శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.