Begin typing your search above and press return to search.

బ‌రికి ముందే!..ఓట‌మిని ఒప్పేసుకున్నారే!

By:  Tupaki Desk   |   25 Feb 2019 10:35 AM IST
బ‌రికి ముందే!..ఓట‌మిని ఒప్పేసుకున్నారే!
X
ఏపీలో అధికార టీడీపీ నిజంగానే ఓట‌మిని ఒప్పేసుకుంది. ఓట‌మిని ఒప్పేసుకోవ‌డ‌మే కాదండోయ్‌... ఏకంగా ఆ ఓట‌మి ఎక్క‌డ త‌న పుట్టి ముంచుతుందోన‌న్న భ‌యంతోనూ టీడీపీ వ‌ణికిపోతోంది. ఇత‌ర పార్టీలు ఈ త‌ర‌హా వైఖ‌రిని అవ‌లంబిస్తే... త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ముందుండే టీడీపీ... ఇప్పుడు త‌నే పోటీకి ముందే కాడిని కింద ప‌డేసిన వైనంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఏపీలో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాల‌కు నిన్న నోటీఫికేష‌న్ జారీ అయ్యింది. వీటిలో ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రులు - ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ సీట్ల‌తో పాటు కృష్ణా - గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంతో పాటు విశాఖ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. వీటిలో రెండు సీట్లు గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గాలే. అంటే విద్యావంతులు ఓట‌ర్లుగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌న్న మాట‌. మ‌రొక‌టి ఉపాధ్యాయ కోటా నియోజ‌క‌వ‌ర్గం.

ఈ మూడు స్థానాల బ‌రిలోకి దిగేది లేదంటూ టీడీపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇందుకు కార‌ణాన్ని కూడా ఆ పార్టీ వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యానే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం లేద‌ని తెలిపిన టీడీపీ అధిష్ఠానం... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీతో అసెంబ్లీ బ‌రిపై అభ్య‌ర్థులు పెద్ద‌గా దృష్టి సారించ‌ర‌ని - ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కంటే అసెంబ్లీ ఎన్నిక‌లే కీల‌కం కాబ‌ట్టి.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది. స‌రే ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన టీడీపీ... విశాఖ లోక‌ల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లో మాత్రం పోటీ చేస్తుంద‌ట‌. అదేంటీ... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ కేడ‌ర్ దృష్టి పెట్ట‌ర‌ని టీడీపీనే చెబుతూ... ఈ స్థానానికి పోటీ చేస్తే.. ఆ ప్ర‌భావం అసెంబ్లీపై ప‌డ‌ద‌ని భావిస్తోందా? అంటే... అదేమీ లేదు.

విశాఖ జిల్లాలో పార్టీ ఓ మోస్త‌రుగా బాగానే ఉంది క‌దా. అంతేకాకుండా ఆ స్థానం టీడీపీ సీనియ‌ర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మ‌ర‌ణంతో ఖాళీ అయిన సీటు. ఆ సీటుకు పోటీ చేయ‌కుంటే... పార్టీ కేడ‌ర్ లో అనుమానాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా ఆ స్థానాన్ని టీడీపీ ఈజీగానే గెలుస్తుంది. ఈ మాట టీడీపీనే స్వ‌యంగా ప్ర‌క‌టించింది కూడా. ఈ లెక్క‌న గెలుపు అవ‌కాశాలున్న విశాఖ స్థానిక సంస్థ‌ల స్థానంలో పోటీ చేస్తూనే.. దానితో పాటే జ‌రిగే మిగిలిన మూడు అసెంబ్లీ సీట్ల‌లో పోటీ చేయ‌బోవ‌డం లేదని చెప్ప‌డ‌మంటే... ఓట‌మిని ఒప్పుకున్నట్టే క‌దా. మొత్తంగా టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పోటీకి ముందే ఓట‌మిని ఒప్పుకున్న‌ట్టేన‌న్న మాట‌.