Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో టీడీపీకి న్యూ లుక్

By:  Tupaki Desk   |   27 July 2015 3:19 PM IST
నెల రోజుల్లో టీడీపీకి న్యూ లుక్
X
పుష్కరాల సందడి పూర్తయింది... గత పదిహేను రోజులుగా నిద్రాహారం లేకుండా శ్రమించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కాస్త విశ్రాంతి దొరికింది. అయితే... ఆయన పుష్కరాలు అలా ముగిశాయో లేదో ఇలా హైదరాబాద్ లో వచ్చివాలిపోయారు. పాలనపై, పార్టీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే పార్టీలో పలు మార్పులు చేసే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

టీడీపీలో వచ్చే నెల రోజుల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణ, ఏపీలకు రెండు నూతన కమిటీలను, వేర్వేరుగా అధ్యక్షులను నియమించనున్నారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అయితే... మహానాడులోనే ఈ మేరకు తీర్మానించారు... ఇప్పుడు దాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలకు సంబంధించి అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పొలిట్ బ్యూరో ఉండనుంది. దీనిని కూడా త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న వారిలో ఎక్కువ మందికి తిరిగి స్థానం ఇచ్చి, కొత్తవారిని కొందరికి అవకాశం కల్పించనున్నారు.

చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడైతే ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరుంటారు.. ఏ ప్రాంతం వారికి ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఎవరన్నది ఇంకా స్పష్టత రాకపోయినా ప్రాంతం పరంగా మాత్రం ఈ పదవిని ఉత్తరాంధ్రకే ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా అశోక్ గజపతిరాజు, కిమిడి కళావెంకటరావుల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు యనమల పేరూ పరిశీలనలో ఉందంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎక్కువగా అశోక్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటే మాత్రం కళావెంకటరావుకు అవకాశం రావొచ్చు. కాగా తెలంగాణలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ చేతిలోనే పార్టీ పగ్గాలుంటాయి. ఏపీ యువత బాధ్యతలు ఎంపీ రామ్మోహన్ నాయుడికి అప్పగిస్తారట. అదే సమయంలో సలహాదారులు, ఇతర కీలక పదవుల్లోనూ మార్పలు ఉండే అవకాశం కనిపిస్తోంది.