Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల డ్యాష్ ల ప్రమాణ స్వీకారం పూర్తయింది

By:  Tupaki Desk   |   4 Oct 2015 11:36 AM IST
తమ్ముళ్ల డ్యాష్ ల ప్రమాణ స్వీకారం పూర్తయింది
X
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ.. రాష్ట్ర కమిటీలకు సంబంధించిన అందరి చేత పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షులు చంద్రబాబు టోకుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సభ్యులందరికి ప్రమాణపత్రాల్ని అందజేశారు.

ఈ ప్రమాణపత్రంలో మొదటి లైనులోనే రెండు ‘డ్యాషులు’ కనిపించాయి. ఇక.. ప్రమాణ పత్రం సింఫుల్ గా కాకుండా కాస్త భారీగా ఉండటం గమనార్హం. ప్రమాణస్వీకారం సందర్భంగా పార్టీని పొగిడేసుకున్న వైనం కనిపిస్తుంది. అంతేకాదు.. కాస్తంత డ్రమటిక్ గా ప్రమాణపత్రం రూపొందించటం గమనార్హం. తమ్ముళ్ల చేత ప్రమాణం చేయించిన ప్రమాణ పత్రంలో డ్యాష్ అనే నేను అనే దాంతో ప్రారంభించారు. సదరు డ్యాష్ దగ్గర ఎవరికి వారు తమ పేరును చెప్పుకోవాల్సి ఉంటుంది. డ్యాష్ పక్కన.. తెలుగుదేశం పార్టీ డ్యాష్ సభ్యునిగా అంటూ మరో డ్యాష్ ఇచ్చారు. ఈ డ్యాష్ లో ఎవరికి వారు తమ తమ హోదాల్ని చెప్పుకోవాల్సి ఉంటుంది.

అలా మొదలై ప్రమాణ పాఠంలో కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. ‘‘నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా పవిత్ర రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా.. నీతి.. నిజాయితీతో నిరాడంబరంగా.. ప్రజా సేవకు అంకితమవుతాను’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రజా జీవితంలో నైతిక విలువలు పాటిస్తే.. ప్రజాసేవే పరమావధిగా పార్టీ నియమాలను అనుసరించి తెలుగుజాతి సమగ్ర ప్రయోజన పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఆత్మవిశ్వాసంతో.. శాంతి సౌభ్యాగ్యాలతో కూడిన సమసమాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా మనసా.. వాచా.. కర్మేణా కృషి చేస్తానని.. మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ ముగించారు. ప్రమాణ స్వీకార పత్రంలో మరీ ఇంత డ్రామా అవసరమా..?