Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ కి టీడీపీ సంబంధాలు పోలేదా!.. ఇదే ప్రూఫ్!

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:10 AM GMT
వైసీపీ ఎంపీ కి టీడీపీ సంబంధాలు పోలేదా!.. ఇదే ప్రూఫ్!
X
రాజ‌కీయాల్లో ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా.. దాని వెనుక అర్ధం.. ప‌ర‌మార్థం.. డిఫ‌రెంట్‌గానే ఉంటాయ‌ని అంటారు పొలిటిక‌ల్ పండితులు. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకుంది అని తెలుస్తుంది . ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరి... ప్ర‌కాశం జిల్లా ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఆయ‌న తాజాగా ఢిల్లీలో ఓ పార్టీ(విందు) ఇచ్చారు. ఇదేమంత పెద్ద విష‌యం కాదు క‌దా? అనే సందేహం రావొచ్చు. కానీ, ఇదే రాజ‌కీయంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం పార్ల‌మెంటు వ‌ర్షాకాలు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంపీలందరూ ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఈ స‌మ‌యంలో హ‌ఠాత్తుగా ఎంపీ మాగుంట ఓ పార్టీ ఏర్పాటు చేశారు. స‌హ‌జంగా ఆయ‌న వైసీపీకి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఇత‌ర‌త్రా అధికారుల‌ను ఆహ్వానిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇదే జ‌రిగింది. అయితే.. వీరితోపాటు.. టీడీపీ ఎంపీల‌ను కూడా ఆహ్వానించేశారు అని అంటున్నారు . నిజానికి ఏపీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య ఏరేంజ్‌లో రాజ‌కీయ వివాదాలు సాగుతున్నాయో.. అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ ఎంపీల వైపు వైసీపీ ఎంపీలు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు.

క‌నీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లోకి కూడా వైసీపీ ఎంపీలు వెళ్ల‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో మాగుంట ఇచ్చిన విందుకు.. టీడీపీ ఎంపీలు హాజ‌రు కావ‌డంతో వైసీపీ ఎంపీలు నిర్ఘాంత పోయారు. ``అస‌లు ఏం జ‌రిగింది? మా ఎంపీ ఇచ్చిన పార్టీలో టీడీపీ ఎంపీలు ఎలా వ‌చ్చారు?`` అని వారు ఆశ్చ‌ర్య‌పోయారు అట . అంతేకాదు.. అస‌లు టీడీపీ ఎంపీల‌ను ఈ పార్టీకి పిలుస్తున్న‌ట్టు కానీ, వారు వ‌స్తున్నార‌ని కానీ.. సొంత పార్టీ ఎంపీల‌కు.. మాగుంట క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌కుండానే.. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎంపీల‌ను ఆహ్వానించ‌డం.. వైసీపీ ఎంపీల‌కు ఆగ్ర‌హం తెప్పించింది అని అంటున్నారు .

దాంతో వైసీపీ ఎంపిలందరు మాగుంట వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో కంగుతిన్నారు . టీడీపీ ఎంపీలను పిలుస్తున్నట్లు తమకు ఎందుకు చెప్పలేదని అని మాట్లాడుకున్నారు అంట . ఎంపీలిచ్చే పార్టీలకు వచ్చిన మిగిలిన ఎంపీలు సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవటం, న‌వ్వుతూ మాట్లాడుకోవ‌డం.. ఒక‌రిపై ఒక‌రు జోకులు పేల్చుకోవ‌డం వంటివి మామూలే. అయితే మాగుంట ఎరేంజ్ చేసిన పార్టీలో టీడీపీ ఎంపీలను చూసిన తర్వత వైసీపీ ఎంపీల మూడ్ మారిపోయి.. ఫొటోలకు, సెల్ఫీలకు మూకుమ్మ‌డిగా దూరంగా ఉండిపోయారు అని అంటున్నారు .

మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజ‌రైన విషయం బయటకు పొక్కటంతో వైసీపీ సీనియ‌ర్‌ నేతలు కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు అంట . మాగుంటకు పాత వాసనలు ఇంకా పోలేదా? లేక .. ఆయ‌న ఏదైనా వ్యూహంతోనే ఇలా చేశారా? అనే చ‌ర్చ‌లు జోరందుకున్నాయి. నిజానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడైన మాగుంట‌.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ గుర్తుపై పోటీకి కూడా దిగారు. అయితే.. వైసీపీ అభ్య‌ర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓట‌మి చ‌విచూశారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు.. మాగుంట‌కు ఎంఎల్సీగా ప్ర‌మోష‌న్ క‌ల్పించారు.

అయితే.. 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి.. మాగుంట‌.. సైకిల్ దిగేసి.. ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే వైవీని త‌ప్పించిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు ఒంగోలు పార్ల‌మెంటు టికెట్‌ను ఇచ్చారు. జ‌గ‌న్ సునామీలో మాగుంట విజ‌యంద‌క్కించుకున్నా.. స్థానికంగా వైసీపీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో ఆయ‌న దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఆనంద‌య్య క‌రోనా మందు విష‌యంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి.. మాగుంట‌కు మ‌ధ్య తెర‌చాటు వివాదం రేగింది. దీంతో మాగుంట స‌ప‌రేట్‌గా ఆనంద‌య్య మందును సేక‌రించి.. ప్ర‌త్యేక శిబిరాలు వేసి ప్ర‌జ‌ల‌కు పంచారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రిని ఆహ్వానించ‌లేదు.

అదేస‌మ‌యంలో జిల్లాకు చెందిన మ‌రో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌తోనూ, ఇత‌ర నేత‌ల‌తోనూ మాగుంట‌కు ప‌డ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈక్ర‌మంలో ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాత్రం క‌లివిడిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు హ‌ఠాత్తుగా తాను ఏర్పాటు చేసిన విందుకు టీడీపీ ఎంపీల‌ను ఆహ్వానించ‌డం.. వైసీపీ ఎంపీల‌కు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి మాగుంట వైఖ‌రిలో మార్పు వ‌చ్చిందా? దీనివెనుక ఏమైనా రాజ‌కీయ కోణం ఉందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రి వైసీపీ నాయ‌కులు పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.