Begin typing your search above and press return to search.

పవన్‌ ఇన్వెస్టిగేషన్‌ తుస్సుమంది

By:  Tupaki Desk   |   9 July 2015 3:50 PM GMT
పవన్‌ ఇన్వెస్టిగేషన్‌ తుస్సుమంది
X
టీడీపీ ఎంపీలను పేరుపెట్టి మరీ విమర్శించిన పవన్‌ కళ్యాణ్‌కు అదేస్థాయిలో రిటర్న్‌ కౌంటర్లు పడేటప్పటికి రెండు రోజుల తరువాత ట్విట్టర్‌ వేదికగా మళ్లీ కౌంటర్‌ ఇవ్వబోయాడు. అయితే... ఏదో పరిశోధన చేసి చెప్పినట్లుగా పార్లమెంటులో విభజన బిల్లు సవరణకు పెట్టిన రోజున ఎందరు టీడీపీ ఎంపీలు హాజరయ్యారంటూ ఆయన ప్రశ్నలు వేశారు... అయితే... అది ఆయన పరిశోధనను కాకుండా అఙానాన్ని బయటపెట్టిందంటున్నారు టీడీపీ ఎంపీలు.

2015 మార్చి 17న లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు పెట్టినప్పుడు కేవలం అయిదుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారని పవన్‌ ఆరోపించారు. మిగిలినవారికి ఏమైందని ప్రశ్నించారు. అయితే... దానికి నిపుణులు, టీడీపీవర్గాలు చెబుతున్న సమాధానం వింటే పవన్‌ కాస్త ఆలోచించి మాట్లాడాల్సింది అనిపించకమానదు. ఆ రోజు సభలో పెట్టిన సవరణ కేవలం రెండు రాష్ట్రల్లోని శాసనమండళ్లలో సభ్యుల సంఖ్య పెంచడానికి సంబంధించినదట.. పైగా టీడీపీ అధికారపక్షంలోనే ఉంది కాబట్టి వారికి అందులో ఏముందన్నది ముందే తెలుసు. ఈ పెంపు నిబంధనల ప్రకారం జరగడంతో ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయకుండా అంతా సాఫీగా సాగిపోయింది. అయితే... విభజన బిల్లుకు సవరణ అని మాత్రమే తెలుసుకున్న పవన్‌ అది మండలి సభుయల సంఖ్యకు సంబంధించింది అని తెలుసుకోలేక బోల్తాపడ్డారు. ఆ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోనియాగాంధీ కూడా అభ్యంతరం చెప్పలేదు...

మరోవైపు టీడీపీ ఎంపీలు ఇంకో విషయాన్నీ పవన్‌కు గుర్తు చేస్తున్నారు. ఎంతమంది హాజరైనా ముందుగా స్పీకర్‌ చెప్పినవారు మాత్రమే మాట్లాడుతారని... స్పీకర్‌ ముందే సమాచారం ఇస్తారని.. ఆ రోజున ఎవరు మాట్లాడాలో ముందే ఖరారవుతుందని.. పవన్‌ ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారు చెబుతున్నారు. లోక్‌సభలో ఇష్టమొచ్చినప్పుడు.. ఇష్టమొచ్చినంతమంది మాట్లాడుతామంటే కుదరదని చెబుతున్నారు. పవన్‌ మరి దీనికేం సమాధానం చెబుతాడో... లేదంటే అన్నయ్య చిరంజీవిలా ఎంపీగా మారి కాస్త ఙానం పెంచుకుంటాడో చూడాలి.