Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీలు వర్సెస్ టీడీపీ ఎంపీలు

By:  Tupaki Desk   |   2 July 2016 10:31 AM GMT
బీజేపీ ఎంపీలు వర్సెస్ టీడీపీ ఎంపీలు
X
కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్త‌లు టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య ప‌ద‌వుల పైర‌వీల‌కు కేంద్రంగా మారుతున్నాయి. త్వరలో కేబినెట్ బెర్త్‌ లు భ‌ర్తీ చేయ‌నున్న‌రని ఖ‌రారైన నేప‌థ్యంలో ఇరు పార్టీల‌కు చెందిన నాయ‌కులు త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలో ఒకరికి ఒక‌రు పోటీగా ముందుకు సాగుతుండటం ఆస‌క్తిక‌రం.

మిత్రపక్షాలైన తెలుగుదేశంపార్టీ - భారతీయ జనతా పార్టీల త‌ర‌ఫున‌ చెరో ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాజపా త‌ర‌ఫున‌ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయడు - నిర్మలా సీతారామన్‌ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి అశోక్‌ గజపతిరాజు - సుజనా చౌదరిలున్నారు. అయితే అటు వెంకయ్యనాయడు - ఇటు అశోక్‌ గజపతిరాజులు ఇద్దరూ క్యాబినెట్ మంత్రులు కాగా మిగిలిన నిర్మలా సీతారామన్ - సుజనా చౌదరిలు సహాయ మంత్రులు మాత్రమే. ప‌లు కారణాల వ‌ల్ల ఈనెల 8వ తేదీన కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి ముహూర్తం నిర్ణయించారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మంత్రివర్గ విస్తరణలో ఏపీకి మరో అవకాశం వస్తుందని జరుగుతున్న ప్రచారంతో రెండు పార్టీలూ తమ ఎంపీలకే అవకాశం ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నట్లు సమాచారం.

టీడీపీ నుంచి ప్రధానంగా మచిలీపట్నం ఎంపి కొనకళ్ళ నారాయణ - భాజపా నుండి విశాఖపట్నం ఎంపి హరిబాబు పేర్లు వినబడుతున్నాయి. వీరిలో ఇద్దరు కూడా ఆయా పార్టీల్లో సీనియర్ నేతలే. కాకపోతే ఇద్దరికీ కొన్ని సానుకూలాంశాలతో పాటు ఒకటి రెండు ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. విశాఖ ఎంపి హరిబాబు పార్టీలో చాలా సీనియర్. ఆయనకు కమలంపార్టీ నుండే కాకుండా ఆర్ ఎస్ ఎస్ నుండి కూడా గట్టి మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే, ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో భాజపా తరపున గెలిచిన నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు కూడా చాపకింద నీరులా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వినికిడి. కాకపోతే పార్టీ తరపున ఇప్పటికే వెంకయ్యనాయడు - నిర్మలా సీతారామన్ ఇద్దరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి మరో ఎంపికి పార్టీ తరపున అవకాశం వస్తుందా అన్నది అనుమానమే. అయితే, వెంకయ్య అయినా నిర్మల అయినా రాజ్యసభలో ప్రస్తుతం రాజస్ధాన్‌ కు - కర్నాటకలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి కమలం పార్టీ తరపున ఏపీలో ఎవరికీ మంత్రివర్గంలో చోటు లేనట్లేనని, ఒకరికి అవకాశం కల్సించాల్సిన అవసరం కూడా ఉందని కొందరు కమలనాధులు అంటున్నారు. అదేవిధంగా, టిడిపి నుండి అశోక్ - సుజనాలకు ఇప్పటికే కొనసాగుతున్నారు కాబట్టి మిత్రపక్షానికి అవకాశం లేదని అంటున్నారు. అయితే, కొనకళ్ళ బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. టిడిపి నుండి ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిద్దరూ అగ్రవర్ణాలకు చెందిన వారే. మరింత మంది బలహీన వర్గాల ఎంపిలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రధాని దృష్టిలో పెట్టుకుంటే కొనకళ్ళకు అవకాశం వస్తుందని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఒకే పార్టీలోని నేత‌లకే కాదు మిత్ర‌ప‌క్షం నాయ‌కుల‌కు సైతం పోటాపోటీగా మారింది.