Begin typing your search above and press return to search.

ఆ తెదేపా ఎంపీ వైకాపా దారిలో ఉన్నారా?

By:  Tupaki Desk   |   14 Nov 2017 3:39 AM GMT
ఆ తెదేపా ఎంపీ వైకాపా దారిలో ఉన్నారా?
X
రాజకీయాల్లో ఫిరాయింపులు అనేవి నిత్యకృత్యం. అటునుంచి ఇటుకు జంపింగులు ఎంత సహజంగా జరుగుతూ ఉంటాయో.. మరి ఇటునుంచి అటుకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా జంపింగులు తప్పవు. ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ గమనిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సిటింగ్ ఎంపీ.. వైకాపాలోకి జంప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ నుంచి తనకు పెద్ద హామీలు ఏమీ అక్కర్లేదని.. ఇప్పుడు సిటింగ్ ఎంపీగా ఉన్న తనకు ఏదో ఒక ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఇస్తే చాలునని ఆయన తన ఆంతరంగికులతో అంటున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి రివర్సులో ఫిరాయింపులు అనేది అంత ఈజీ కాదు గానీ.. ఈ ఎంపీ గురించి ఆల్రెడీ పార్టీ వర్గాల్లో కూడా ముమ్మరంగా చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.. చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్.

అవును.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలోనే ఆయనకు చిరకాల మిత్రుడిగా గుర్తింపు ఉన్న ఎంపీ ఎన్ శివప్రసాద్... ఇప్పుడు వైకాపా వారితో తెరవెనుక బేరసారాలు సాగిస్తున్నట్లుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. తనకు ప్రధానంగా ఎమ్మెల్యేగా పనిచేయాలని ఉన్నప్పటికీ.. చంద్రబాబునాయుడు తనను ప్రోత్సహించడం లేదనే భావనతో శివప్రసాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో సత్యవేడు నుంచి ఎమ్మెల్యే అయిన శివప్రసాద్ ను ఆ తర్వాత చిత్తూరు ఎంపీ స్థానం రిజర్వుడు కోటాలోకి వెళ్లిన తర్వాత.. చంద్రబాబు అక్కడ బరిలోకి దించారు. కేవలం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు సాధించే మెజారిటీతోనే.. చిత్తూరు ఎంపీ సీటును కూడా తెదేపా ప్రతిసారీ గెలుచుకుంటూ ఉంటుంది. అలా శివప్రసాద్ తనకు పెద్ద శ్రమ లేకుండానే ఎంపీ అయ్యారు.

ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ఎంపీనే అయినప్పటికీ.. మోడీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా చిత్ర విచిత్రమైన నిరసనలను వ్యక్తం చేయడం ద్వారా శివప్రసాద్ గతంలో పలుమార్లు వార్తల్లోకి వచ్చారు. కేవలం చంద్రబాబునాయుడు మీద అభిమానంతో ఆగుతున్నానని, లేకపోతే మోడీ సర్కారు తప్పులను బయటపెట్టేవాడినని కూడా ఆయన అనేక మందితో అంటూ ఉండేవారని సమాచారం. కాకపోతే.. ఇప్పుడు ఏకంగా పార్టీ మారాలనే ఉద్దేశంతోనే గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ రాబోయేది పార్టీలు మారే సంవత్సరం అని, రంగులు మారేసంవత్సరం అని ఆయన కామెంట్ చేయడం - వైకాపా ఎమ్మెల్యే రోజాతో ఇటీవలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కూడా అనుమానాలకు ఊతమిస్తోంది.