Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ స‌న్నిహితుడు

By:  Tupaki Desk   |   26 Jan 2018 6:53 PM IST
జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ స‌న్నిహితుడు
X
దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌న్నిహితుడు - మాజీ ఎంపీ అన్నయ్యగారి సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీ ఊహించని షాక్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌త‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సాయిప్ర‌తాప్ సుమారు రెండేళ్ల రాజ‌కీయ విరామం అనంత‌రం కాంగ్రెస్‌కు టాటా చెప్పి తెలుగుదేశంలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరిన త‌ర్వాత‌ ఆయ‌న్ను రాజంపేట పార్లమెంటు ఇన్‌ ఛార్జిగా తెలుగుదేశం అధిష్ఠానం ఎంపిక చేసింది. అయితే మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీ గూటికి చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు ఇటు టీడీపీ వ్య‌వ‌హ‌రించిన‌ తీరు - అటు రాజ‌కీయ భ‌విష్య‌త్ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

సాయిప్ర‌తాప్ కంటే ముందు రాజంపేట పార్లమెంటు ఇన్‌ఛార్జిగా మాజీ ఎంపీ గునిపాటి రామయ్య వ్యవహరించారు. ఆయన మృతి చెందటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ సాయిప్రతాప్‌ కు బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొద్దికాలం క్రితం జ‌రిపిన స‌ర్వేలో - రాజంపేట పార్లమెంట్‌ లో కేంద్రమాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ టీడీపీలో కొనసాగుతున్నప్ప‌టికీ పార్టీ సీనియ‌ర్ నేత ఎస్.పాలకొండ్రాయుడు పేరును రాబోయే ఎన్నిక‌ల్లో దింపే అవ‌కాశం ఉన్న‌ట్లు టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి.

ఇదిలాఉండ‌గా..తాజాగా సాయిప్ర‌తాప్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ జ‌గ‌న్‌ పై ప్ర‌శంస‌లు కురిపించారు. పాద‌యాత్ర రూపంలో ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ క‌లుపుకొనిపోతున్న తీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని సాయిప్ర‌తాప్ అన్నారు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుంటున్న తీరు - ఆయ‌న క‌లుపుకొని ముందుకు సాగుతున్న విధానంతో ఆయ‌న‌కు రాబోయే కాలంలో పాద‌యాత్ర బ‌లంగా మార‌నుంద‌ని వివ‌రించారు.

కాగా, సాయిప్ర‌తాప్ వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఆయ‌న వైసీపీలో చేరే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. రాజ‌కీయ‌వ‌ర్గాల చ‌ర్చ ప్ర‌కారం గ‌త ఎన్నిక‌ల్లోనే రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి సాయిప్ర‌తాప్ వైసీపీ టికెట్ ఆకాంక్షించారు. అయితే జ‌గ‌న్ ఆయ‌న్ను చేర్చుకోవ‌డం ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. పెద్ద‌రెడ్డి మిథున్ రెడ్డికి అక్క‌డి నుంచి టికెట్ కేటాయించి ఆ ఎన్నిక‌ల్లో గెలిపించుకున్నారు. కాగా, తాజా వ్యాఖ్య‌లు సాయిప్ర‌తాప్ వైసీపీ వైపు మొగ్గుచూపుతున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ....ఆయ‌న్ను జ‌గ‌న్ పార్టీలో చేర్చుకుంటారా? వైసీపీ టికెట్ ఇస్తారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.