Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎంపీ.. వైసీపీ కి మద్దతిస్తారట

By:  Tupaki Desk   |   6 Feb 2020 9:31 AM IST
ఈ టీడీపీ ఎంపీ.. వైసీపీ కి మద్దతిస్తారట
X
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య నిత్యం మాటల యుద్ధమే జరుగుతోంది. విషయం ఏదైనా... వైసీపీ సరేనంటే టీడీపీ కాదంటోంది. టీడీపీ ఔనంటే... వైసీపీ వద్దంటోంది. ఇలాంటి నేపథ్యం లో టీడీపీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా వైసీపీకి మద్దతుగా నిలుస్తామంటూ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ మరెవరో కాదు.. రాజకీయాల్లో ఓ రేంజి సంపాదించున్నకింజరాపు ఎర్రన్నాయుడి కుమారుడు, టీడీపీ యువనేత, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడే.

రామ్మోహన్ నాయుడి నోట వైసీపీకి మద్దతు మాట వచ్చిందంటే... కాస్త తరచి చూడాల్సిందే కదా. నిజమే... వైసీపీకి మద్దతు ఇస్తామంటూ రామ్మోహన్ నాయుడు ప్రకటించారంటే... అందులో ఏదో మెలిక ఉండే ఉంటుంది కదా. ఆ మెలిక లేకపోతే.. ఇప్పటికే టీడీపీలో పెను కలవరమే పుట్టేది కదా. వైసీపీకి మద్దతు ఇస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించినా.. టీడీపీలో ఎలాంటి అలజడి లేదంటే... అందులో ఏదో తిరకాసు ఉన్నట్టే కదా. ఆ తిరకాసు ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.

ఏపీకి ప్రత్యేక హోదా అన్ని పార్టీలకు కీలకాంశమే. 25 మంది ఎంపీలను ఇస్తే... కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకునివస్తామని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జగన్ అనుకున్నట్లు కాకున్నా... ఏకంగా 22 మంది ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఇచ్చారు. ఇది జరిగి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతోంది. కేంద్రం రెండు బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టింది. అయినా ఏపీకి ప్రత్యేక హోదా కాదు కదా... కనీస కేటాయింపులు కూడా లేవు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు... ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాడితే... టీడీపీ ఎంపీలుగా తాము కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు. మరి రామ్మోహన్ నాయుడుతో పాటు టీడీపీ ఎంపీల మద్దతును వైసీపీ ఎప్పుడు తీసుకుంటుందో చూడాలి.