Begin typing your search above and press return to search.

ఉమనైజర్లకు సీట్లు ఇస్తే నేను మద్దతివ్వను: మరోసారి టీడీపీ ఎంపీ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   15 Jan 2023 1:13 PM GMT
ఉమనైజర్లకు సీట్లు ఇస్తే నేను మద్దతివ్వను: మరోసారి టీడీపీ ఎంపీ హాట్‌ కామెంట్స్‌!
X
గత కొంత కాలంగా హాట్‌ కామెంట్స్‌ చేస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ అధిష్టానం ఎవరికైనా సీటు ఇవ్వవచ్చన్నారు. అయితే తన తమ్ముడు కేశినేని శివనాథ్‌ (చిన్ని), మరో ముగ్గురికి మాత్రం సీటు ఇవ్వవద్దన్నారు. సీటు ఇస్తే తాను వారికి సహకరించబోనని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉమనైజర్లు, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ లో ఉన్నవారికి, కబ్జాదార్లకు సీట్లు ఇవ్వవద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని సూచించారు. ఇలాంటి వారికి సీట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాలను నాశనం చేయొద్దని కోరారు.

విజయవాడ ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కేశినేని నాని ప్రకటించడంతో అతడికి ధీటైన అభ్యర్థిని టీడీపీ వెతుకుతోంది. కేశినేని స్థానంలో ఆర్థికంగా బలవంతుడైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పై దృష్టి సారించిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు సుజనా చౌదరి పేరు కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వినిపిస్తోంది. గత ఎన్నికల నాటికి టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే 2019లో టీడీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక సుజనా చౌదరితోపాటు సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎడమ భుజం, కుడి భుజంలాంటి వ్యక్తులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపిందే చంద్రబాబు అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి సుజనా చౌదరి మళ్లీ తన మాతృ పార్టీ టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు వద్దకు తన దూతలను సైతం పంపారని వార్తలు వస్తున్నాయి. అలాగే చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సైతం సుజనా చౌదరి సంప్రదించినట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం సుజనా చౌదరి రాజ్యసభ్య సభ్యుడిగా పదవీకాలం ముగిసింది. దీంతో ఇక మళ్లీ రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ లేకపోవడంతో లోక్‌సభకు టీడీపీ తరఫున పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం.

తనకు విజయవాడ టీడీపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తే కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఖర్చంతా తాను భరిస్తానని సుజనా చౌదరి ఆఫర్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోనూ కేశినేని నానియే విజయవాడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో టీడీపీ అధిష్టానంపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మీడియా ముందు వెళ్లగక్కడం, సోషల్‌ మీడియాలోనూ పోస్టులు చేయడం చేస్తున్నారని టీడీపీ వర్గాలే ఆయనపై మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేశినేని నానిని పక్కనపెట్టే ఉద్దేశంలో టీడీపీ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉండే కేశినేని చిన్ని ఇటీవల కాలంలో విజయవాడలో తరచూ పర్యటించడం, ఇటీవల వంగవీటి రాధాకృష్నతో భేటీ కావడం సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలో టీడీపీ తరఫున విజయవాడలో కేశినేని చిన్ని పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గత రెండు పర్యాయాలు 2014, 2019ల్లో కేశినాని నాని ఘనవిజయం సాధించారు. అయితే ఆ తర్వాత విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలతో ఏర్పడ్డ విభేదాలతో ఆయన ఉప్పూనిప్పుగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి.

టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వడానికి నిరాకరించడం వంటి కారణాలతో కేశినాని నాని టీడీపీకి గుడ్‌ బై చెప్పడం ఖాయమనే ఊహాగానాలు వెలువడ్డాయి.

అంతేకాకుండా విజయవాడ టీడీపీలో బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని.. అలాగే తనకు వ్యతిరేకంగా తన సోదరుడు కేశినేని చిన్నిని చేరదీస్తున్నారని కేశినేని నాని అలక బూనారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకున్నారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని గత రెండు పర్యాయాలు 2014, 2019ల్లో వరుసగా విజయవాడ ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. అయితే గత కొంతకాలంగా విజయవాడలో టీడీపీలోనే కీలకంగా ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమలతో కేశినాని నానికి విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విభేదాలు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లోనూ బయటపడ్డాయి. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా టీడీపీ తరఫున కేశినేని శ్వేతను బరిలోకి దించారు. దీనికి మిగతా నేతలు అభ్యంతరం తెలిపారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లకు అత్యంత విశ్వసనీయ పాత్రులుగా బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా ఉన్నారు. దీంతో వారికే చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని కేశినేని నానిలో అభిప్రాయం ఉందని అంటున్నారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ అధిష్టానంతో అంటీముట్టనట్టు కేశినేని నాని వ్యవహరిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నాడు టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ నేతలే లక్ష్యంగా విమర్శలకు దిగారు. తన సోదరుడు కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులకు టికెట్‌ ఇస్తే తన మద్దతు ఉండదని కేశినేని నాని కుండబద్దలు కొట్టారు. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవ్వొచ్చన్నారు. కానీ దావుద్‌ ఇబ్రహీం లాంటి వారిని, కబ్జాదారులకు, ఉమెనైజర్లకు ఇవ్వవచ్చా అని ప్రశ్నించారు.

తాను రాజకీయాల్లోనే కాదు..జీవితంలోనూ ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని తేల్చిచెప్పారు. చార్లెస్‌ సోబ్రాజ్, దావుద్‌ ఇబ్రహీం సెక్స్‌ రాకెట్, కాల్‌ మనీ చేసేవాళ్లకు కూడా పోటీ చేసే హక్కు ఉందంటూ కేశినేని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే ఎన్టీఆర్‌ ఒక సిద్ధాంతం కోసం పార్టీ పెట్టారని.. ఆ సిద్ధాంతాన్ని విస్మరించి సీట్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని సెటైర్లు వేశారు.