Begin typing your search above and press return to search.

ఎంపీ మైండ్ గేమ్ ఎవరిమీదో ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 11:30 AM GMT
ఎంపీ మైండ్ గేమ్ ఎవరిమీదో ?
X
విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. టీడీపీలోని విజయవాడ ఎంపి కేశినేని నాని మద్దతుదారులు, అభిమానుల నుంచి ఒక్కసారిగా డిమాండ్లు పెరిగిపోయాయి. ఇంతకీ వారు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో నాని ఎంపిగా టీడీపీ నుంచి పోటీ చేయాల్సిందే అని. పోటీ విషయంలో అసలు వాళ్ళు ఎందుకిలా డిమాండ్ చేస్తున్నారు ?

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను కానీ లేదా తన కూతురు కానీ ఎంపిగా పోటీ చేసేది లేదని నాని నేరుగా చంద్రబాబునాయుడుకే చెప్పారట. దాదాపు మూడు నెలల క్రితం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా నాని మాట్లాడుతూ విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు కొత్త అభ్యర్ధిని వెతుక్కోమని స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ నిర్ణయానికి కారణం ఏమిటంటే పార్టీలోని నేతలతో పెరిగిపోతున్న వివాదాలే కారణం. పార్టీలోని బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కు ఎంపితో ఏమాత్రం పొసగడం లేదు.

ఈ మధ్యనే జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ కూతురును మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాలని అనుకున్నారు. దాంతో పై ముగ్గురు నేతలు చంద్రబాబును కలిసి ఆ ప్రకటనను విత్ డ్రా చేయించారు. దాంతో వీళ్ళ మధ్య వివాదం పెరిగిపోయి మీడియా ముందే ముగ్గురునేతలు-ఎంపి ఒకరిని మరొకరు అమ్మ నా బూతులు తిట్టే సుకోవటం పార్టీలో సంచలనమైంది. చంద్రబాబు పంచాయితి చేసినా వారు వెనక్కు తగ్గలేదు.

అప్పటికే పార్టీ కార్యక్రమాల్లో అంతంతమాత్రంగా పాల్గొంటున్న ఎంపి తర్వాత పూర్తిగా దూరమైపోయారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమనే భావన ఎంపిలో పెరిగిపోయిందట. అందుకనే ముందుగానే చెప్పేసి పోటీకి దూరమైపోవాలని ఎంపి డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో చంద్రబాబుతో పాటు తన ప్రత్యర్ధి వర్గంపై పై చేయి సాధించేందుకే ఎంపీ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ పోటీ చేస్తే తన ఓటమికి గట్టి ప్రయత్నాలు చేస్తారని అనుమానం పట్టి పీడిస్తోందట. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని నాని బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. రేపు పార్టీ పరిస్ధితి బావోలేక ఓడిపోయినా దాన్ని ప్రత్యర్ధుల మీదకు నెట్టేందుకు ఎంపి రెడీ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తానే పోటీచేయాలని చంద్రబాబు ఒత్తిడి చేస్తే ఎంఎల్ఏలుగా తాను చెప్పినవారికే టికెట్లు ఇచ్చేట్లు ఒత్తిడి పెంచటమే ఎంపి వ్యూహమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద ఎంపి మైండ్ గేమ్ ఎవరిమీదన్నది తొందరలోనే తేలనుంది.