Begin typing your search above and press return to search.

బెజవాడ కబుర్లు : ఆ ఎంపీ ఎందుకు అలిగారు...?

By:  Tupaki Desk   |   30 May 2022 3:32 AM GMT
బెజవాడ కబుర్లు : ఆ ఎంపీ ఎందుకు అలిగారు...?
X
ఆయన సీనియర్ నాయకుడు. అంతే కాదు, విజయవాడ లాంటి రాజకీయ రాజధాని నుంచి రెండవసారి వరసగా ఎంపీ అయి తన బలాన్ని చాటుకున్నారు. అది కూడా జగన్ వేవ్ లో గెలవడం అంటే మాటలు కాదు. ఆయనే టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని. ఆయన ఎందుకో అధినాయకత్వంలో ఈ మధ్య అంత సఖ్యతగా ఉండడంలేదు.

కేశినేని నానికి విజయవాడలో వర్గ పోరు ఎక్కువగా ఉంది. ఆయన్ని కాదని మిగిలిన నాయకులు ఒక్కటి అయ్యారు. వారిలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ, దేవినేని ఉమా ఇలా వీళ్ళంతా ఒక వర్గంగా ఉంటూ తన పార్టీ ఎంపీనే వ్యతిరేకిస్తున్నారు. ఇక ఎంపీ గారి కుమార్తెను గత ఏడాది జరిగిన మేయర్ ఎన్నికల్లో పోటీగా పెడితే ఆమె అభ్యర్ధిత్వం విషయంలో విభేదాలు కూడా వచ్చాయి.

నాని కూతురు గెలుపు కోసం పార్టీ నాయకులే పనిచేయలేదని ఎంపీ గారి అభియోగం. అంతే కాదు, ఎంపీని నువ్వెంత అంటూ గట్టిగానే సొంత పార్టీ నేతలు అంటున్నా అధినాయకత్వం నచ్చచెప్పలేకపోతోంది. ఈ నేపధ్యంలో తాజాగా జరిగిన మహానాడుకు ఏకంగా ఎంపీ కేశినేని నాని డుమ్మా కొట్టారు. ఆయన తిన్నగా వెళ్ళి ఢిల్లీలో మకాం పెట్టారు.

అది అతి పెద్ద చర్చగా మారింది.పార్టీకి చెందిన ఎంపీలు ముగ్గురు ఉంటే వారిలో నాని డుమ్మా కొట్టడం పార్టీ వర్గాలలో చర్చగా కూడా సాగింది. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో నానికి టికెట్ దక్కదని ఒక వైపు ప్రచారం సాగుతోంది. ఇక రీసెంట్ గా వచ్చిన సర్వేలు చూస్తే వైసీపీ ఎంపీలతో పాటు వ్యతిరేకత ఉన్న ఎంపీగా కేశినేని నాని పేరు బయటకు వచ్చింది.

దాంతో ఈ పరిణామాలు అన్నీ చూసిన మీదటనే నాని పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే నాని తమ్ముడు కేశినేని చిన్నిని చినబాబు లోకేష్ అక్కడ ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. దాంతో చిన్ని ఇపుడు విజయవాడ బాధ్యతలు భుజాన వేసుకుని గట్టిగా పనిచేస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ క్యాండిడేట్ అవుతారు అని అంటున్నారు.

మంచి సౌండ్ పార్టీగా రియల్ ఎస్టేట్ బిల్డర్ గా పేరున్న చిన్ని ఇపుడు విజయవాడ టీడీపీలో తనదైన శైలిలో తెగ జోరు చేస్తున్నారుట. అలాగే అన్న మహానాడుకు డుమ్మా కొడితే తమ్ముడు అక్కడకు వెళ్ళి సందడి చేశారు. మొత్తానికి చినబాబు చల్లని చూపు చిన్ని మీద ఉందని అంటున్నారు. మొత్తానికి అలిగిన నానిని బుజ్జగించే సీన్ ఉంటుందా అన్నదే పార్టీలో చర్చట.