Begin typing your search above and press return to search.

టీడీపీకి మ‌రో షాక్‌!... పార్టీకి మోదుగుల రాజీనామా!

By:  Tupaki Desk   |   5 March 2019 7:45 PM IST
టీడీపీకి మ‌రో షాక్‌!... పార్టీకి మోదుగుల రాజీనామా!
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీల‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి... నేరుగా విప‌క్ష పార్టీ వైసీపీలో చేరిపోగా... ఇప్పుడు మ‌రో కీల‌క నేత టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఈ దెబ్బ‌ టీడీపీకి కాస్తంత గ‌ట్టిగానే త‌గిలే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీకి కీల‌క జిల్లాగా ఉన్న గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. అంతేకాకుండా ఈ నెల 9న వైసీపీలో చేరేందుకు ఆయ‌న స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ దెబ్బ టీడీపీకి ముందే తెలిసినా... మోదుగుల‌ను బుజ్జ‌గించ‌డం ఆ పార్టీకి చేత కాలేద‌నే చెప్పాలి.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌గా మోదుగుల గ‌త కొంతకాలంగా టీడీపీలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నార‌నే చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ... ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కే అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వ‌డంతో పాటుగా ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే అంశాన్ని ప‌లుమార్లు త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకున్న మోదుగుల‌... తాను టీడీపీలో మ‌రెంత‌కాల‌మో సాగ‌లేన‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల త‌న సామాజిక వ‌ర్గం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మోదుగుల‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీనే గెలిపించుకోవాల‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నాడే మోదుగుల వైసీపీలోకి చేరిపోతార‌ని భావించినా... టీడీపీలో ప‌రిస్థితి మారుతుందేమోన‌ని చాలా కాలం పాటే ఆగార‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అయితే అలాంటి మార్పులేమీ రాక‌పోగా... ఇత‌ర సామాజిక వ‌ర్గ నేత‌లు పార్టీని వీడినా న‌ష్టం లేద‌న్న భావ‌న‌తో టీడీపీకి సాగిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మొన్న గుంటూరు జిల్లా స‌మీక్ష‌కు కూడా మోదుగుల డుమ్మా కొట్టారు. తాజాగా నేడు ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసిన మోదుగుల... చంద్ర‌బాబుకు గ‌ట్టి షాకే ఇచ్చార‌ని చెప్పాలి. ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌తో చ‌ర్చించిన మోదుగుల ఈ నెల 9న వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. మోదుగుల టీడీపీకి రాజీనామా... వైసీపీలో చేరిక‌తో గుంటూరు జిల్లా స‌మీక‌ర‌ణాలు భారీగానే మారే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.