Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై సొంత ఎమ్మెల్యేనే సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   15 Feb 2020 2:22 PM IST
చంద్రబాబుపై సొంత ఎమ్మెల్యేనే సంచలన ఆరోపణలు
X
ఐటీ దాడులు, రూ.2 వేల కోట్ల నిధుల మళ్లింపు అంశం టీడీపీపై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇతర పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేయగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు చేసి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఈ ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించాలని పట్టుబట్టారు. ఈ పరిణామం టీడీపీలో కలవరం మొదలైంది. సొంత ఎమ్మెల్యేనే పార్టీ అధినేతపై విమర్శలు చేయడంతో టీడీపీ నాయకులు అవాక్కయ్యారు.

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడులపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐటీ సోదాల పై స్పందిస్తూ.. ఇప్పటివరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే అని పేర్కొన్నారు. చంద్రబాబు ఖాతాలో పెద్ద కుంభకోణాలే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలైందని చెప్పారు. వీటిపై చంద్రబాబు నోరు మెదపడం లేదు ఎందుకో? ఎప్పుడూ నీతి, నిజాయతీ కి మారు పేరు అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఇప్పుడేం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గిరిధర్ ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాల పై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

చంద్రబాబును మించిన ఘనుడు లేడు.. చంద్రబాబు, అతని సన్నిహితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయపడతాయని ఎమ్మెల్యే గిరి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ అజ్ఞాతం లోకి వెళ్లి పోయారని మద్దాలి గిరి ఆరోపించారు.

పార్టీ అధినేతపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇంత దారుణంగా విమర్శలు చేయడం తొలిసారి. ఒక్కసారిగా ఎమ్మెల్యే గిరి విమర్శలు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులకు బలం లభించింది. మీ పార్టీ ఎమ్మెల్యేనే మీరు అవినీతికి పాల్పడ్డు చెబుతున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎందుకు అలా స్పందించాడో తెలియడం లేదు. త్వరలోనే అధికార పార్టీ లో చేరేందుకు ఈ విధంగా పార్టీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారని పలువురు చెబుతున్నారు.