Begin typing your search above and press return to search.

వృద్ధుడిపై చింతమనేని బూతుపురాణం

By:  Tupaki Desk   |   4 Feb 2019 7:29 AM GMT
వృద్ధుడిపై చింతమనేని బూతుపురాణం
X
పింఛన్ ఇస్తామంటూ పిలిచి ఓ వృద్దుడిపై ప్రభుత్వ చీఫ్ - ఎమ్మెల్యే చింతమనేని బూతుపురాణం విప్పారు. ఈ సంఘటన దెందలూరి నియోజకవర్గంలోని విజరాయి గ్రామంలో జరిగింది.. ఎమ్మెల్యే చింతమనేని నియోజకవర్గంలో పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఇంటింటికి మహిళలు వెళ్లి బొట్టుపెట్టి సభకు రావాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఈసారి పెంచిన పింఛన్లు - మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తామని తప్పకుండా విజయవంతం చేయాలని కోరారు.

అయితే ఈ సభకు హాజరైన 70ఏళ్ల లేగల సుబ్బరావు అనే వ్యక్తిపై ఎమ్మెల్యే చింతమనేని వీరంగం సృష్టించారు. ‘‘నీ కొడుకులు వైఎస్సాఆర్ సీపీలో తిరుగుతుంటే.. పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’’ అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న సుబ్బారావు కొడుకులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేను నిలదీశారు.

పింఛన్ ఇస్తామంటూ పిలిచి తమ తండ్రిని అవమానిస్తారా అంటూ ప్రశ్నించడంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సంఘటనలో వృద్ధుడికి కాలికి గాయమైంది. పోలీసులు సుబ్బారావు కొడుకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ బైఠాయించడంతో పోలీసులు సుబ్బారావు కొడుకులను విడిచిపెట్టారు.

ఎమ్మెల్యే తీరుపై సుబ్బారావు కొడుకులు స్పందిస్తూ ప్రభుత్వం పింఛన్లు కేవలం టీడీపీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు మాత్రమే ఇవ్వాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లను పార్టీలకు ఎందుకు ఆపాదిస్తారని ప్రశ్నించారు.

ఏదిఏమైనా ఎమ్మెల్యే చింతమనేని తీరును చూసి అక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మచ్చిక చేసుకోవాల్సిందిపోయి రచ్చ చేసుకున్నాడు ఏంటని చర్చించుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యే తలపెట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమం పక్కకుపోయి వృద్ధుడిపై రచ్చే హైలెట్ గా మారింది. ఇప్పటికైనా చింతమనేని తన తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు.. నిత్యం వివాదాలతో కాలక్షేపం చేసే చింతమనేని తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి మరీ..