Begin typing your search above and press return to search.

రోజా కోసం దండం పెట్టి వేడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   22 Dec 2015 9:34 AM GMT
రోజా కోసం దండం పెట్టి వేడుకుంటున్నారు
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు స‌స్పెన్ష‌న్‌కు గురైన వైకాపా సభ్యురాలు రోజా అసెంబ్లీకి రాక‌పోయిన‌ప్ప‌టికీ...ఆమె సృష్టించిన క‌లక‌లం ఇంకా కొనసాగుతోంది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ద‌ళిత శాస‌న‌సభ్యురాలు అనితపై వ్య‌క్తిగ‌త‌ విమ‌ర్శ‌లు చేశారు. రోజా కామెంట్ చేసిన రెండ్రోజుల త‌ర్వాత అసెంబ్లీకి హాజ‌రైన అనిత స‌భ‌లో మాట్లాడుతూ...కంటతడి పెట్టారు. రోజా తన పట్ల చేసిన‌ అసభ్య వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆమె ఒక్కసారిగా అనిత‌ కంట తడిపెట్టారు. ఆమె వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియక రెండు రోజులు ఇంట్లోనే ఉండిపోయానని..వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే అన్ని విషయాలూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. దళితురాలిని అయినందునే ఇటువంటి మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. అసభ్యంగా ప్రవర్తించి, మాట్లాడిన రోజాను ఏడాది కాదు మెత్తం అసెంబ్లీలోనే అడుగుపెట్టకుండా శిక్షించాలని అనిత కోరారు. రోజా స‌స్పెన్ష‌న్‌ పై విమ‌ర్శ‌లు చేస్తున్న వైఎస్‌ జగన్ ఆయ‌న కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆయనకు ఎంత బాధ ఉంటుందో తెలుస్తుందని అనిత అన్నారు.

రోజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తం చేసిన అనంతరం టీడీపీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దళిత మహిళ గురించి వైకాపా సభ్యురాలు రోజా చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివన్నారు. రోజాకు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు. రోజా ఇలా ప్రవర్తించడం తొలి సారి కాదనీ, గతంలో కూడా ఇలాగే ప్రవర్తించి సస్పెన్షన్ కు గురైంద‌ని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి - స్పీకర్ దయాభిక్షతో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారనీ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ఈక్ర‌మంలోనే బీజేపీ బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు కొత్త వాద‌న వినిపించారు. రోజా సస్పెన్షన్ ఏడాది కాకుండా కొంత తగ్గించాలని తాను కోరిన విషయం వాస్తవమేననీ, అయితే సహచర ఎమ్మెల్యేపై రోజా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు అప్పుడు తన దృష్టికి రాకపోవడం వల్లనే అలా కోరానని అన్నారు. ఆ వ్యాఖ్యలు తెలుసుకున్నాక ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని విష్ణు కుమార్ రాజు చెప్పారు.

మంత్రి పీతల సుజాత సైతం రోజా తీరుపై మండిప‌డుతూ గతంలో తనపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. గతంలో తనపై చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అనితపై చేసిన వ్యాఖ్యలు మొత్తం దళిత మహిళలపై చేసిన దాడిగా అభివర్ణించిన పీతల సుజాత...ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల‌న్నారు. భవిష్యత్ లో ఏ మహిళకూ ఇలా జరగకుండా ఉండే విధంగా రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజా జీవితంలో ఎన్నడూ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా, అసలు ఎన్నికలలో పోటీ చేసే అర్హతే లేకుండా చేయాలని మంత్రి పీత‌ల సుజాత చేతులు జోడించి స్పీకర్‌ ను కోరారు.