Begin typing your search above and press return to search.

వడదెబ్బ బాధితుల లిస్ట్ లో ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   8 April 2016 10:34 AM IST
వడదెబ్బ బాధితుల లిస్ట్ లో ఏపీ మంత్రి
X
ఎండలు మండుతున్నాయి. ఎండల ధాటికి సాదాసీదా ప్రజలే కాదు.. వీవీఐపీలు సైతం వణికే పరిస్థితి. మందిమార్బలంతో ఉండే వారు సైతం ఎండ దెబ్బకు విలవిలలాడుతున్న వైనం చూస్తే.. భానుడి ప్రతాపం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ మధ్యనే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వరంగల్ పర్యటన సందర్భంగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురి కావటం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా ఏపీమంత్రి అచ్చెన్నాయుడు కూడా చేరారు.

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో జరుగుతున్నగిరిజనోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అచ్చెన్నాయుడు ఎండ తీవ్రత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఐటీడీఏ సమీపంలోని కలెక్టర్ భవనం వద్ద రెస్ట్ తీసుకున్నారు. ఎండ బారిన పడిన మంత్రి అచ్చెన్నాయుడు ఉత్సవాల్లో పాల్గొనకుండా తమ స్వగ్రామమైన నిమ్మాడకు వెళ్లిపోయారు. మంత్రి స్థాయి వ్యక్తులకు వసతులు ఎంతలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారు సైతం వడదెబ్బ బారిన పడుతున్నారంటే.. ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుంది.

వీవీఐపీల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఎండ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఎండలో అట్టే తిరగకూడదన్న విషయాన్ని గుర్తించాలి. ఈ జాగ్రత్తను సాయంత్రం 5 గంటల వరకూ ఫాలో కావాల్సిందే. లేకుండా అనారోగ్యం బారిన పడటం ఖాయం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలోస్కూల్ పిల్లలకు ఇచ్చే వేసవి సెలవుల విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచిస్తే మంచిది. అవసరమైతే.. ముందుగా సెలవులు ఇచ్చేసి.. జూన్ మొదట్లోనే స్కూళ్లు మళ్లీ తెరిచేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.