Begin typing your search above and press return to search.

నవ్యాంధ్ర రాజధానికి ఇక మంత్రులు

By:  Tupaki Desk   |   17 Aug 2015 1:03 PM GMT
నవ్యాంధ్ర రాజధానికి ఇక మంత్రులు
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు క్యాంపు కార్యాలయం, నివాసం ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు మంత్రలు వంతు. వాస్తవానికి, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అందరికంటే ముందుగానే తన కార్యాలయాన్ని విజయవాడకు మార్చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన మంత్రులకు కూడా అక్కడ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి.

ముఖ్యమంత్రి తోపాటే మంత్రులు కూడా తమ అధికారిక కార్యకలాపాలను విజయవాడ నుంచే మొదలు పెట్టడానికి సమీక్షలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ భవనాల వివరాలను తీసుకున్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎక్కడెక్కడ వేటిని ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ అతిథి గృహంలోని దిగువ హాలు, పై అంతస్తులోని హాళ్లను మంత్రులు తమ శాఖల సమీక్షకు వినియోగించనున్నారు. సబ్ కలెక్టర్ సమావేశ కార్యాలయ భవనాన్ని కూడా మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని మంత్రుల తాత్కాలిక నివాసానికి వినియోగించనున్నారు.

కొన్ని శాఖలు శాశ్వతంగానే విజయవాడకు తరలి రానున్నాయి. పశు సంవర్థక శాఖ నెల రోజుల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. డీజీపీ కార్యాలయం ఏర్పడిన నేపథ్యంలో హోం మంత్రి కూడా తన కార్యాలయాలను విజయవాడలో అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ మంత్రి ఇప్పటికే విజయవాడలో తన సమీక్షలను నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ మంత్రులు కూడా ఇక్కడి నుంచే సమీక్షలను నిర్వహిస్తున్నారు.