Begin typing your search above and press return to search.

బాబు నిర్ణ‌యం త‌మ్ముళ్ల‌ను వ‌ణికించేస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   22 Oct 2017 4:21 AM GMT
బాబు నిర్ణ‌యం త‌మ్ముళ్ల‌ను వ‌ణికించేస్తోంద‌ట‌
X
తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై తెలుగుత‌మ్ముళ్ల‌లోనే అసంతృప్తి వ్య‌క్త‌మవుతోంది. ప్ర‌జ‌ల్లో నిర‌స‌న‌లు ఎదురవుతున్నాయ‌ని పేర్కొంటూ...ఈ అసంతృప్తి ఓట్ల‌ను సైతం చీల్చుతుంద‌ని చెప్తున్నారు. ఈ విష‌యం ఏకంగా సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ వ‌ద్దే వాపోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఇదంతా దేని గురించి అంటే...చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు సరఫరా చేస్తున్న రేషన్‌ కుదింపు వ్యవహారం. ఈ నిర్ణ‌యం ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెంచుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది.

రేషన్‌ షాపుల్లో బియ్యంతోపాటు ఇతర సరుకులు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి - పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ వద్ద టిడిపి నేతలు వాపోయారు. అది కూడా రాజ‌ధాని ప్రాంత‌మైన కృష్ణా జిల్లా వాసులు కావ‌డం గ‌మ‌నార్హం. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో జ‌రిగిన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో కృష్ణాజిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోని వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలోని నేత‌లంతా ముక్త‌కంఠంతో రేషన్ కుదింపు వ్య‌వ‌హ‌రంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కిరోసిన్‌ - చక్కెర ఇవ్వడం ఆపేసిందని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి వివరించామని - అందువల్ల నేతలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నట్లు తెలిసింది.నియోజకవర్గాలవారీగా ఆయా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అగిడి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇటీవల పార్టీ చేపట్టిన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రజల నుండి రేషన్‌ - పెన్షన్‌ - ఇళ్ల కేటాయింపు సమస్యలు నేతల దృష్టికి వచ్చాయని లోకేష్‌ కు స్థానిక నేతలు వివరించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్ నాయ‌కుల‌కు ఎన్నిక‌ల హిత‌బోధ చేసిన‌ట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ బూత్‌ ల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ ను సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులను లోకేష్‌ ఆదేశించినట్లు సమాచారం. నవంబర్‌ మొదటి వారంలో విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సమీక్షలు ఏర్పాటు చేయడంతోపాటు బహిరంగసభలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. విశాఖ తరహాలో విజయవాడ పరిశుభ్రమైన నగరంగా రూపు దిద్దుకునే నిమిత్తం నిధుల కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్‌ అన్నారు. స్వచ్ఛ విజయవాడగా రూపుదిద్దేంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వర్మీకంపోస్టు కేంద్రాల ఏర్పాటును వెంటనే పూర్తి చేసి స్వచ్ఛ విజయవాడగా తీర్చిదిద్దాలన్నారు. వర్మీ కంపోస్టు కేంద్రాల ఏర్పాటును పూర్తి చేసిన అనంతరం ప్రజాప్రతినిధులందరూ గ్రామాల్లోనూ - నగరాల్లోనూ ఒక రోజు శ్రమదానం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.