Begin typing your search above and press return to search.

మహానాడు కాదు రేపు : నడి వయసులో నవ చైతన్యం తీసుకురావాలి

By:  Tupaki Desk   |   27 May 2022 7:30 AM GMT
మహానాడు కాదు రేపు : నడి వయసులో నవ చైతన్యం తీసుకురావాలి
X
మహానాడు అంటే అత్యంత ఘనమైన దినమని అర్ధం. అలాంటి రోజుని తెలుగుదేశం ప్రతీ ఏటా జరుగుకుంటోంది. పార్టీ వ్యవస్థాపకుని పుట్టిన రోజుకే పార్టీ వేడుకను నిర్వహిస్తోంది. ఇదంతా టీడీపీ ఆచారంగా ఉంది. మరి మహానాడు అంటే గత వైభవమేనా అన్న చర్చ కూడా వస్తోంది. గతంలో మేము అలా చేశాం, ఇలా చేశామని గొప్పలు చెప్పుకుని భోజనాలు చేసి వెళ్ళిపోవడమేనా అన్న మాట కూడా వస్తోంది.

మహానాడు అంటే నిజానికి రోజు గొప్ప అని కాదు, మహానాడు అంటే రేపటి గురించి ఆలోచించాలి. మహా గొప్పగా రేపటి రోజులు కూడా ఉండాలని అభిలషించాలి. ఆ దిశగా సానుకూల దృక్పధంతో అడుగులు బలంగా వేయగలగాలి. అసలు ఈ రాష్ట్రం గురించి పూర్వం పరం అన్నీ తెలిసిన పార్టీగా టీడీపీని చూడాలి, ఉమ్మడి ఏపీలో రాజ్యం చేశారు, విభజన ఏపీలోనూ పాలించారు.

ఏపీ కష్టాలు నష్టాలు అన్నీ కూడా బాగా తెలుసు. ఇపుడు ఏపీ ఏ రకమైన ఇబ్బందులలో ఉంది అన్నది కూడా బాగా తెలుసు. ఇపుడు సాగుతున్న పాలన పట్ల ఒక ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఎలాగూ విమర్శలు చేస్తుంది. మరి దానితోనే వదిలిపెడుతుందా లేక తనదైన శైలిలో రేపటి రోజును ఏపీని ఎలా బాగు చేసుకోగలమో తనదైన శైలిలో భరోసా ఇస్తుందా. ఆ దిశగా కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తుందా ఇదే జనమంతా చూస్తున్నారు.

ఇదే మహానాడు నుంచి అయిదు కోట్ల ఆంధ్ర జనం కోరుకుంటున్నారు. వైసీపీని చెడా మడా తిట్టేసి తాము అప్పట్లో అలా చేశాం ఇలా చేశమాని నాలుగు మాటలు చెప్పేసుకుంటే ఇంతటి మహనాడుకు విలువ అన్నది మాత్రం ఉండదని అంతా అంటున్న మాట. చంద్రబాబు వయసులో కానీ రాజకీయ అనుభవంలో కానీ సీనియర్. ఆయన మహానాడు వేదికగా సూటిగా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

నిజాయతీగా పార్టీ గురించి సమీక్ష చేసుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి గత వెలుగులు ఇపుడు లేవు. అవి బాగా తగ్గాయి. వైసీపీ వ్యతిరేకత మీద టీడీపీ మీద ఏమైనా మోజు పుడితే పుట్టవచ్చు కానీ టీడీపీ మీద సొంతంగా పాజిటివ్ గా జనాల నుంచి రావాల్సిన మద్దతు అయితే రావడం లేదు. అది ఎందుకు రావడంలేదు అన్న చర్చను మాత్రం మహానాడు వేదికగా జరుపుకోవాలి.

అదే విధంగా వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏమి చేస్తామన్నది కూడా చెప్పాలి. ఏపీలో వైసీపీ సర్కార్ పధకాలను అమలు చేస్తూ డబ్బుల పంపిణీ పేరిట వృధా చేస్తోంది అని చెబుతున్న టీడీపీ వారు తాము పవర్ లోకి వస్తే ఆల్టర్నెషన్ గా ఏమి చేస్తారు అన్నది కూడా చెప్పాలి. అలాగే వాలంటీర్ల వ్యవస్థకు కానీ వైసీపీ చెబుతున్న అధికార వికేంద్రీకరణకు కానీ ఇతర అనేక విషయాల మీద కానీ సామాజిక న్యాయం మీద కానీ టీడీపీ తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టాలి.

జనంలో తాను ఏంటి అన్నది చెప్పుకుని చర్చకు పెట్టి వారి మనసులు గెలవాలి. మరి ఆ దిశగా మహానాడు సాగితేనే విజయవంతం అయినట్లు. అంతే తప్ప మహనాడుకు ఇన్ని వేల మంది జనాలు వచ్చారు. సూపర్ సక్సెస్ అని అనుకుంటే మాత్రం భ్రమల్లోకి వెళ్ళిపోయినట్లే.