Begin typing your search above and press return to search.

బాబు హైదరాబాద్ లో.. ఆన్ లైన్లో టీడీపీ పాలన

By:  Tupaki Desk   |   30 July 2020 10:46 AM IST
బాబు హైదరాబాద్ లో.. ఆన్ లైన్లో టీడీపీ పాలన
X
కరోనా లాక్ డౌన్ తో తెలుగు దేశం పార్టీ వ్యవహారం మొత్తం ఆన్ లైన్ లోనే సాగుతోందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు కాళ్లు అరిగేలా పర్యటనలు పెట్టుకోవడం లేదని.. జూమ్ యాప్ లో హాయ్ అంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం నాయకుల పనితీరు ఇప్పుడు ఆరు జూమ్ లైవులు, అరవై ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లా ఉందని కౌంటర్లు ఇస్తున్నారు.

టీడీపీ నాయకులను కరోనా బాగా మార్చేసిందన్న వాదన ఆ పార్టీ క్షేత్రస్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ మూడు నుంచి ఐదు వరకు విలేకరుల సమావేశాలు మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించేవారు. ఇప్పుడా ఆ ఊసే కనిపించడం లేదు. ఇక హైదరాబాద్ లో వున్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ జూమ్ లైవ్ లు, ట్వీట్ల తో కాలం గడుపుతున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. బలమైన మీడియా తమ చేతుల్లో వుందనే ధీమాతో తాము ఏమి చెప్పినా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. కొన్ని టీవీ ఛానెల్స్ కూడా ప్రతిరోజూ నిర్వహించే పార్టీ కార్యక్రమాలను రెగ్యులర్ గా లైవ్ ఇవ్వలేక నానాతంటాలు పడుతున్నాయని మీడియా సర్కిల్స్ లో కూడా చెప్పుకుంటున్నారు.. ఇక కొందరు టీడీపీ అనుకూల రిపోర్టర్లు టిడిపీ నేతల విలేకరుల సమావేశాల దాడి తట్టుకోలేక అటువైపు పోవడం లేదట.. దీంతో పార్టీ కార్యాలయం నుంచి యూట్యూబ్ లింక్ లు పంపి లైవ్ ఇవ్వాలని కోరే పరిస్థితి వచ్చిందని సమాచారం. మరీ విచిత్రం ఏంటంటే ఆ లైవ్ ప్రోగ్రామ్ లు వీక్షించే వారి సంఖ్య ఘోరంగా ఉంటోందని చానెల్స్ కూడా కలవరపడుతున్నాయట... 20, 30 మంది కంటే ఎక్కువ చుసిన సంధర్భాలు చాలా తక్కువట.. వీరు కూడా ఆ బీట్ కవర్ చేసే రిపోర్టర్ లు, కెమెరామెన్లు కావటం విశేషం.. చంద్రబాబు నిర్వహించే లైవ్ ప్రోగ్రామ్ లు అయినా ఇదే పరిస్థితి నెలకొందని టీడీపీ చానెల్స్ తలపట్టుకుంటున్నాయట... అయినా గంటల తరబడి ఉపన్యాసాలు మాత్రం చంద్రబాబు దంచుతూనే ఉంటారు. ఆ చానెల్స్ లైవ్ లు ఇస్తునే ఉంటున్నాయట...

మంచి పనులు చేసినా కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక్క జూలై నెలలోనే సుమారు వంద కాన్ఫరెన్స్ లు, జూమ్ లైవుల ద్వారా నిర్వహించారంటేనే ఆ పార్టీ.. మీడియా మీదనే ఎంత ఆధారపడి బతుకుతుందో అర్థం అవుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో వుంటూ ప్రతిరోజూ జూమ్ లైవుల ద్వారా విలేకర్లతో సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు నిర్వహించే సమావేశాల్లో తన సహజధోరిణిలో గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా కార్యకరలను విసిగిస్తున్నారనే వాదన వారిలో ఉంది. సమావేశాలకు వచ్చే కార్యకర్త హాజరుశాతం కూడా దీనివల్ల పడిపోతోందని కింది స్థాయి నాయకులు వాపోతున్నారు. చంద్రబాబు ఒక్కోసారి ఒకేరోజు రెండు విలేకరుల సమావేశాలు నిర్వహించిన సంధర్భాలు కూడా వున్నాయి. ఇవి తెలుగుదేశం శ్రేణులకు తీవ్ర బోరింగ్ గా అనిపిస్తున్నాయట..

కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాయకుడు హైదరాబాద్ కు చేరి అందుబాటులో లేకపోవడం, చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా కేవలం ట్వీట్లకే పరిమితం కావడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాజధాని ప్రాంతంలో ఉండే పార్టీ నాయకులు దేవినేని ఉమా, బోండా ఉమా, వర్లరామయ్య, పట్టాభి, అశోక్ బాబు, అనూరాధ తదితర నాయకులు పార్టీ కార్యాలయం లో నిర్వహించే విలేకరుల సమావేశాలకు రావడం ఏ సబ్జెక్టు పైన అయినా అనర్గళంగా గంటల కొద్దీ మాట్లాడడం, పెద్ద బాస్ తో మార్కులు వేయించుకోవడం,వెళ్ళిపోవడం తప్ప ఏమి ప్రయోజనం లేదని సొంత పార్టీ వారే అంటున్నారు. కార్యకర్తలు సమస్యలు చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయాలకి వచ్చినా పట్టించుకొనే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు.

ఈ మధ్య హైదరాబాద్ లో వున్న తమ నాయకుడు చంద్రబాబు ఇంటి వద్ద తన గోడు వెల్లబోసుకొనేందుకు వెంకటేశ్వర్లు అనే కార్యకర్త ప్రయత్నించగా కనీసం సెక్యూరిటీ గేటు లోపలికి కూడా అనుమంతించకపోవడం టీడీపీ నేతల్లో నైరాశ్యాన్ని మిగిల్చిందట.. గేటు ముందే ఆ కార్యకర్త తన అక్రోశాన్ని వెల్లగక్కిన వీడియో కాస్త సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ఇంట్లోనే వున్నా కలవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి అన్ని చోట్ల వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా ఎక్కడ నుంచి ఆ వీడియోలు వచ్చాయో నిర్ధారణ చేసుకోకూడా విమర్శలు చేయడం తర్వాత అభాసుపాలు కావడం ఇటీవల టీడీపీకి సహజంగా జరుగుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అనూష అనే టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె తెలంగాణ లో జరిగిన కరోనా పేషెంట్ దుస్థితి కి చెందిన వీడియో ఏపీలో జరిగినట్లు వైరల్ చేసింది. దీనిపై టీడీపీ నాయకులు వాస్తవాలను కూడా తెలుసుకోకుండా విమర్శించి నవ్వుల పాలయ్యారు. తర్వాత మీడియాలో నిజాలు బయటికి రావడంతో కిమ్మన లేదు. ఇలా ఎన్నో సంఘటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉంటూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా.. ఏపీలో టీడీపీని పాలిస్తున్న చంద్రబాబు తీరుపై సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి అసహనం నెలకొందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.