Begin typing your search above and press return to search.

బాబు నోట...టీడీపీ ఓట‌మి మాట‌

By:  Tupaki Desk   |   3 Feb 2019 6:29 AM GMT
బాబు నోట...టీడీపీ ఓట‌మి మాట‌
X
తెలుగుదేశం పార్టీ పట్ల‌, ప్ర‌ధానంగా త‌న ప‌రిపాల‌న విష‌యంలో ప్ర‌జ‌ల్లో ఉన్న స్ప‌ష్ట‌మైన వ్య‌తిరేక‌త ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు దృష్టికి వ‌చ్చిందా? ప‌్ర‌స్తుతం ప్ర‌క‌టిస్తున్న అనేకానేక ప‌థ‌కాలు...తాయిలాలు అన్నీ ఓట‌ర్ల‌ను ప్ర‌సన్నం చేసుకునేందుకేనా? ప‌లు స‌ర్వేల్లో ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం గురించి స్ప‌ష్ట‌మవుతున్న నేప‌థ్యంలో పార్టీ భ‌విష్య‌త్ గురించి చంద్ర‌బాబు ఏమ‌నుకుంటున్నారు? ఇవ‌న్నీ స‌హ‌జంగానే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆసక్తిని రేకెత్తించేవి. అయితే, వీటికి స‌మాధానం చంద్ర‌బాబు నోటివెంటే తాజాగా వ‌చ్చింది.

కేసరపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ సంక్షేమ, ప్రగతి పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు. తన లక్ష్యం ఒక్కటేనని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాలని, తద్వారా ప్రతి లబ్దిదారుడు ఆనందంగా ఉండాలని చెప్పారు. చంద్రన్న పథకం కింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. రూ. 83 వేల కోట్ల ఖర్చుతో 23 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవరూ చేయని సాహసం చేశామని గర్వంగా చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. కొంత మంది సర్వేలు చూసి సంబరపడిపోతున్నారని, కేంద్రానికి ఎవరూ సహకరించవద్దని కోరారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి జరిగేదన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాల్సి ఉందని పవన్‌ కల్యాణ్‌ తాను వేసిన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ద్వారా చెప్పారన్నారు. మనకు అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆనాడు తాను చేసిన తప్పును గ్రహించింది కాబట్టే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీఇచ్చిందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌ కలిసి నాటకాలు ఆడుతున్నారని చంద్ర‌బాబు ఆరోపించారు. కోడికత్తి కేసు ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఐదేళ్లు శ్రమించానని, కానీ కొందరు తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొందరు సర్వేలు చూసి తెగ సంబరపడిపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటంటూ తనను అడిగిన పారిశ్రామికవేత్తలకు కూడా ఇదే సమాధానం చెప్పానని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, చంద్ర‌బాబు నోటి వెంట స్వ‌యంగా టీడీపీ ఓట‌మి మాట రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.