Begin typing your search above and press return to search.

అమరావతిలో టీడీపీ నేతల భారీ కుంభకోణం

By:  Tupaki Desk   |   27 Dec 2019 12:36 PM GMT
అమరావతిలో టీడీపీ నేతల భారీ కుంభకోణం
X
తీగలాగితే ఢొంక కదిలింది. అమరావతి రాజధాని తరలించవద్దని టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళన వెనుక వారు కొన్న భూముల లెక్క ఉన్నట్టు తేటతెల్లమైంది. రాజధానిగా అమరావతిని మార్చుదామనగానే ఆందోళనలకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతల తెరవెనుక ఉన్నదేంటో వైసీపీ సర్కారు బయటపెట్టింది.

అమరావతి రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం, నేతలు పాల్పడిన భూకుంభకోణాన్ని వైసీపీ ప్రభుత్వం బట్టబయలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం కీలక నివేదికను కేబినెట్ భేటిలో బయటపెట్టింది. దీన్ని బట్టి టీడీపీ నేతలు అమరావతి పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేసినట్టు.. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు బయటపడింది.

రాజధానిగా అమరావతిని నిర్ణయించకముందే టీడీపీ నేతలు దాదాపు 4075 ఎకరాల భూములను అమరావతి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు మంత్రి వర్గ ఉపసంఘం సంచలన నిజాలను బయటపెట్టింది. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, హరిప్రసాద్ ల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి అందింది. గత ప్రభుత్వంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటిలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు భూములు కొన్నట్టు కమిటీ నిగ్గుతేల్చింది.

ఇక 900 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నట్టు కమిటీ నివేదికలో పొందుపర్చింది. తెల్ల రేషన్ కార్డు దారులు టీడీపీ బినామీలుగా కోట్ల భూములు కొన్న వ్యవహారం వెలుగుచూసింది.

దీన్ని బట్టి టీడీపీ నేతలే బినామీలతో వేల కోట్ల రూపాయల రాజధాని భూములను కొనిపించి అక్కడ రాజధాని ఏర్పాటుకు ముందే కోట్లకు పడగలెత్తారని తేటతెల్లమైంది. ఈ భారీ భూ కుంభకోణంతో ఇప్పుడు టీడీపీ నేతల బండారం బయటపడింది. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు సీబీఐ విచారణ జరిపిస్తామని మంత్రి నాని ప్రకటించడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.