Begin typing your search above and press return to search.

పోటీ చేయమంటున్న తమ్ముళ్ళు... ?

By:  Tupaki Desk   |   19 Dec 2021 11:32 AM GMT
పోటీ చేయమంటున్న తమ్ముళ్ళు... ?
X
తెలుగు దేశం పార్టీ చరిత్ర చూస్తే నాలుగు దశాబ్దాలు. దేశంలో ప్రాంతీయ పార్టీలలో ఇంతటి సుదీర్ఘమైన ప్రస్థానం చాలా తక్కువ పార్టీలకే ఉంది. అలాంటి టీడీపీని ఎన్టీయార్ పార్లమెంట్ లో అందరూ చూసేలా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక చంద్రబాబు జమానాల్లో టీడీపీ రెండు సార్లు గెలిస్తే మూడు సార్లు ఓడింది. ఇక వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటికీ రెడీ కాలేకపోతోంది. పొత్తుల వేటలో ఒక వైపు అధినాయకుడు బిజీగా ఉంటే తాము పోటీ చేసేది లేదని కొందరు తమ్ముళ్ళు చెబుతున్నట్లుగా ప్రచారం అవుతోంది.

ఇంతకీ తమ్ముళ్ళు దేనికి పోటీ చేయరు అంటే ఎంపీ సీట్లకు అని అంటున్నారు. ఎంపీ అంటే ఏడు అసెంబ్లీ సీట్లు. ఒక అభ్యర్ధి ఎంపీగా పోటీ చేస్తే ఆ పరిధిలోని ఎమ్మెల్యేలందరికీ ఆర్ధికంగా ఆదుకోవాలి. టీడీపీ ఇపుడు విపక్షంలో ఉంది.అయితే గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ ఏలుబడిలో అది భిన్నం. ఎందుకంటే ఆర్ధిక మూలాలను బాగా దెబ్బ కొట్టేశారు. ఇక వచ్చే ఎన్నికలు కూడా అతి ఖరీదైనవిగా చెబుతున్నారు.

అధికారంలో ఉన్న వైసీపీకి ఎంత ఖర్చు అయినా ఓకే కానీ టీడీపీకి మాత్రం అది భరించనలవి కానిదే అంటున్నారు. దాంతో ఎంపీ అంటే వద్దు బాబోయ్ అన్న మాట అయితే ఉందిట. ఇక ఏపీలో మొత్తం పాతిక సీట్లు ఉంటే అందులో గతసారి ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే గెలిచారు. ఆ ముగ్గురిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయన ఓకే అంటే టికెట్ ఖాయం. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు రెడీగా ఉంటారు. గుంటూరు నుంచి చూస్తే గల్లా జయదేవ్ ఈ మధ్య పెద్దగా కనిపించడంలేదు. దాంతో పాటు గుంటూరుకు ఈసారి కొత్త క్యాండిడేట్ ని వెతకాలని అనుకుంటున్నారు

ఇక విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయడానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. విశాఖ జిల్లాలో అరకు సీటుకు ఈ రోజుకీ క్యాండిడేట్ లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తెచ్చి పెట్టిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారని టాక్. అనకాపల్లి నుంచి గతసారి ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ ఎన్నికల తరువాత వైసీపీలో చేరిపోయారు. ఇక రాజమండ్రీ నుంచి గతసారి పోటీ చేసిన మురళీమోహన్ కుటుంబం ఈసారి పాలిటిక్స్ లో లేదు. ఇలాగే ఏలూరులో మాగంటి బాబు కూడా కుటుంబ కష్టాలతో రాజకీయాలను వదిలేసారు అంటున్నారు.

ఇదే టైమ్ లో నర్సాపురం నుంచి శివరామరాజు కూడా పెద్దగా ఇంటరెస్ట్ చూపించడంలేదుట. రాయలసీమలో చూసుకున్నా గతసారి పోటీ చేసి ఓడిన వారిలో కొందరు మరణించారు. మరి కొందరు ఇనాక్టివ్ గా ఉన్నారు. చాలా చోట్ల ఇంచార్జులు కూడా కనిపించడంలేదు. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు మొత్తం పాతిక ఎంపీ సీట్లకు గానూ పదిహేను నుంచి ఇరవై దాకా ఎంపీ అభ్యర్ధుల కొరత అయితే టీడీపీకి ఉందని చెబుతున్నారు. మరి పార్టీకి ఎన్నికల వేళ ఊపు వస్తే అపుడు కొత్తగా ఎవరైనా గెలుపు అవకాశాలను చూసుకుని బరిలోకి దిగుతారేమో కానీ ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓకే కానీ ఎంపీ వద్దు అనేస్తున్నారుట. చూడాలి అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో.