Begin typing your search above and press return to search.

పవన్‌ ప్రశ్నలకు నోట మాట రాలేదెందుకు?

By:  Tupaki Desk   |   11 July 2015 2:16 PM IST
పవన్‌ ప్రశ్నలకు నోట మాట రాలేదెందుకు?
X
నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటా? నీ సంగతి తేలుస్తా లాంటి వ్యవహారాల్ని ప్రదర్శించటం రాజకీయాల్లో అంత తేలికైన విషయాలు కావు. ఒకరు ఒక మాట అంటే.. దానికి వంద అర్థాలు తీసే పరిస్థితి కనిపిస్తుంటుంది. అందుకే.. నేతలు ఆచితూచి మాట్లాడుతుంటారు. కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా బ్యాలెన్స్‌ కోల్పోయి మాట్లాడి అడ్డంగా బుక్‌ అయిపోతుంటారు.

తాజాగా ఏపీ ఎంపీల వ్యవహారం ఇంచుమించు అదే తీరుతో ఉన్నట్లు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పలు పదిఅంశాలతో పాటు.. ఏపీ ఎంపీల వైఖరిని.. వారి పని తీరును పెద్దఎత్తున తప్పు పట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న మాదిరి ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలని.. ఈ విషయం మీద ఏపీ ఎంపీలు ఎంతమేర పని చేశారని ప్రశ్నించారు.

ఇలా ప్రశ్నించే సమయంలో కొందరు నేతల పేర్లను పవన్‌ ఉదహరించారు. అంతే దీనిపై వారు మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ తమను ఒక తిట్టు తిడితే.. ఆయన్ని రెండు తిట్లు తిడితే నోరు మూసుకొని ఉంటాడన్న విచిత్రమైన ప్లాన్‌ వేశారు. తమ్ముళ్లపై పవన్‌ విరుచుకుపడిన ఉదంతాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. జపాన్‌ నుంచి పవన్‌ మీద విమర్శలుచేయొద్దని తమ్ముళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. తమను పేరు పెట్టి మరీ తిట్టారంటూ తెగ ఫీలైపోయిన ఎంపీలు పలువురు పవన్‌పై విరుచుకుపడ్డారు. తమను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతామంటూ చాంతాడంత చిట్టాను విప్పదీయటం.. దీనికి కౌంటర్‌గా ట్విట్టర్‌ ఆధారంగా మరోసారి ప్రశ్నలు సంధించారు.

ఊహించని విధంగా బుల్లెట్ల మాదిరి దూసుకొచ్చిన ట్వీట్స్‌పై తమ్ముళ్లు నీళ్లు నమిలే పరిస్థితి. దీనికి తోడు.. జపాన్‌లో ఉన్న చంద్రబాబు కూడా సీరియస్‌ అయి తమ్ముళ్ల నోటికి తాళాలు వేయటంతో ఎలాంటి స్పందన వద్దంటూ గట్టిగా చెప్పినట్లు చెబుతున్నారు. అందుకే ట్విట్టర్‌ ద్వారా తీవ్రస్థాయిలో నిలదీసినా వాటికి సమాధానాలు చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. అదేదో మొదటే ఉంటే.. పవన్‌ చేత రెండోసారి ప్రశ్నలతో నిలదీయించుకునే అవకాశమే ఉండేది కాదు కదా. తమ్ముళ్లకు ఆ తెలివే ఉంటే ఇంకేమన్న భావన వ్యక్తమవుతోంది.